జిల్లాలో..
నెల్లూరు(టౌన్): విద్యాశాఖ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం పేద పిల్లలు చదివే సర్కారు బడులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఉన్నత పోస్టుల్లో అధికారులు లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు – నేడు పథకం కింద వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లాలో స్కూళ్లను అభివృద్ధి చేసింది. నేడు ఆ పనులు నిలిచిపోయాయి. ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, డిజిటల్ విద్య, ట్యాబ్‌లు తదితర వాటిని గాలికొదిలేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే.. నేడు సీఎం చంద్రబాబు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల వైపు తల్లిదండ్రులు మళ్లేలా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
బోలెడు ఖాళీలు
జిల్లా విద్యాశాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు ప్రాంతాల్లో డిప్యూటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వారిని నెలరోజుల క్రితం బదిలీ చేశారు. అప్పటి నుంచి అలా వదిలేశారు. కందుకూరులో మాత్రం ఇన్‌చార్జి డిప్యూటీ డీఈఓగా ఒకరికి బాధ్యతలు అప్పజెప్పారు. అదే విధంగా జిల్లాలో 38 ఎంఈఓ పోస్టులు ఉండగా వాటిల్లో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతారామపురం, కొండాపురం, జలదంకి, కావలి, బోగోలు, ఏఎస్‌పేట, దగదర్తి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చి, సంగం, రాపూరు, పొదలకూరు, కోవూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, నెల్లూరు అర్బన్ ప్రాంతాల్లోనే రెగ్యులర్ మండల విద్యాశాఖాధికారులున్నారు. మిగిలిన చోట్ల ఇతరులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
లేకపోవడంతో..
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంఈఓ, ఉన్నత పాఠశాలలను డిప్యూటీ డీఈఓలు పర్యవేక్షిస్తుంటారు. పాఠశాలల్లో బోధన, సకాలంలో సిలబస్, ఉపాధ్యాయుల జీతభత్యాలు, పథకాలను విద్యార్థులకు అందించడం తదితర బాధ్యతలను ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు చూస్తారు. పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. కొత్తగా వచ్చిన డీఈఓ సమావేశాలు, సెల్ కాన్ఫరెన్స్‌లకు పరిమితమయ్యారని ప్రచారం ఉంది. దీంతో విద్యాశాఖలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. టీచర్లు పాఠశాలకు రోజూ వస్తున్నారా?, సకాలంలో సిలబస్ పూర్తి చేస్తున్నారా? లేదా? తదితర విషయాలపై పర్యవేక్షణ ఉండటం లేదు. ఓ వైపు మార్చి 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తారు. చాలా పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. కొన్నిచోట్ల అర్హత ఉన్న ఎస్జీటీలను సర్దుబాటు చేసినా అనుభవలేమితో సక్రమంగా బోధన చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంకా జిల్లాస్థాయిలో సర్దుబాటు జరగలేదు. ఈ విద్యా సంవత్సరంలో చేస్తారా? లేదా? అనే అనుమానం టీచర్లలో ఉంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి కాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది. ఖాళీలను భర్తీ చేసి, సబ్జెక్ట్ టీచర్లను నియమిస్తే పేద పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇతర వ్యాపకాల్లో..
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పలువురు టీచర్లు పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ వేసి ఎంఈఓ కార్యాలయాల్లో తిష్ట వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరి కొంతమంది ఇతర వ్యాపకాల్లో ఉన్నట్లు తెలిసింది. ఉదాహరణకు ఇందుకూరుపేట మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఒకరు నెల్లూరులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. డీఎస్సీ, పోలీస్, బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వందలాది మందిని చేర్చుకున్నారు. ఆయనకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కంటే కోచింగ్ సెంటర్‌లో వారే ముఖ్యమయ్యారు. స్కూల్‌కు వెళ్లినా ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఆఖరి బెల్ ఎప్పుడు కొడతారా.. వెళ్లిపోదామా? అని చూస్తుంటారని ప్రచారం ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బోధనలో పాఠశాలలకు స్టార్ ర్యాంకింగ్‌లు ప్రకటించింది. కొన్ని జీరో ర్యాంకింగ్‌లో ఉండగా ఎక్కువ బడులు 3, 4లో ఉన్నట్లు తేలింది. అయితే 5వ ర్యాంకింగ్‌లో జిల్లాలో ఒక్క పాఠశాల కూడా లేకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల్లోనే విద్యాశాఖలో పరిస్థితులు తారుమారయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలలు : 2,604
విద్యార్థుల సంఖ్య :
1.82 లక్షల మంది
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
విద్యాశాఖకు పెద్దపీట
నేడు గాలికొదిలేసిన
కూటమి ప్రభుత్వం
నాలుగు డిప్యూటీ డీఈఓ
పోస్టుల్లో మూడు ఖాళీ
ఎంఈఓ పోస్టుల్లో సగానికి పైనే..
పాఠశాలలపై పర్యవేక్షణ లేదు
నిలిచిపోయిన నాడు – నేడు పనులు
త్వరలో భర్తీ చేస్తారు
జిల్లాలో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ఈ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆయా మండలాల్లో పలువురికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పాం. బోధనకు ఇబ్బందులు లేకుండా ఆయా స్కూళ్లకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం.
– ఆర్.బాలాజీరావు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment