చికిత్స పొందుతున్న గంగాధర, కుమార్తెలు గంగోత్రి, కావేరి, కీర్తి
రాయదుర్గం: బంధువుల్లో ఒకరి వివాహేతర సంబంధానికి తమను బాధ్యులను చేస్తూ దెప్పిపొడుస్తుండటాన్ని భరించలేకపోయిన ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెందాడు. చావే శరణ్యమనుకున్నాడు. తను పోయాక పిల్లలు అనాథలవుతారని భావించాడు. చివరకు ముగ్గురు కూతుళ్లకు విషం తాపి.. ఆపై తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయదుర్గం పట్టణ శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరు మండం గొల్లపల్లికి చెందిన వడ్డే గంగాధరకు గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన వడ్డే గీతతో వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల వయసున్న గంగోత్రి, ఆరేళ్ల వయసున్న కావేరి, రెండేళ్ల వయసున్న కీర్తి సంతానం. గొల్లపల్లిలోనే భార్యతో కలిసి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్దకుమార్తె గంగోత్రిని
చదువుకునేందుకు పూలకుంటలో అమ్మమ్మ, తాతయ్యల వద్దకు పంపించాడు. ఇదిలా ఉండగా.. భార్య తరఫు బంధువుల్లోని ఒక వివాహితకు గొల్లపల్లిలోని వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. విషయం బయటపడిన తర్వాత వివాహిత కుటుంబంలో చిచ్చు రేగి కాపురం కూలింది. ఇందుకు గంగాధర్‌ను బాధ్యుడిని చేస్తూ భార్య తరఫు బంధువుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దెప్పిపొడుపు మాటలు భరించలేకపోయిన గంగాధర ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కూతుళ్లు అనాథలు కాకూడదని భావించి వారిని చంపి.. తర్వాత తానూ చావాలనుకున్నాడు. శుక్రవారం భార్య కూలి పనికి వెళ్లగానే.. తన వద్ద ఉంటున్న ఇద్దరు కూతుళ్లను ‘అమ్మమ్మ ఊరికెళ్దాం’ అని చెప్పి ద్విచక్ర వాహనంపై బయల్దేరి పూలకుంట ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లాడు. అటు నుంచి ముగ్గురు కుమార్తెలతో కలిసి రాయదుర్గం పట్టణ శివారులోని రస సిద్దుల కొండ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పురుగుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను కూతుళ్లకు తాపించి, తనూ తాగాడు. చిన్నమ్మాయి కీర్తి కడుపులో మంట అంటూ విలవిల లాడుతుండటంతో చూడలేక అందరినీ తీసుకుని బైక్‌పై రాయదుర్గం ఆస్పత్రికి తీసుకొచ్చి చేర్చాడు. వైద్యులకు విషయం తెలియజేశాడు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయితే చిన్నారి కీర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేల్చారు. మిగిలిన వారిలోనూ మోతాదుకంటే ఎక్కువగా పురుగుమందు ఉన్నట్టు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం నలుగురినీ అనంతపురం సర్వజన ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న గీతా పిల్లలను చూసి బోరున విలపించింది. ఎంతపనిచేశావయ్యా అంటూరోదించింది. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రమణ తెలిపారు.
ముగ్గురు పిల్లలు సహా
తండ్రి ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment