ప్రేమికుల ఆత్మహత్య
పావగడ: జీవితంపై విరక్తితో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వెంకటమ్మనపల్లికి చెందిన గోవిందరెడ్డి, లక్ష్మీదేవి (బధిరురాలు) బతుకు తెరువు కోసం కొన్నేళ్లుగా బెంగళూరులోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన జ్యోతి(30)తో గోవిందరెడ్డి (35) వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. గురువారం పావగడకు వచ్చిన వారు రాత్రి స్థానిక ఓ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చెళ్లకెరె క్రాస్ వద్దకు చేరుకుని బయలు ప్రదేశంలో మద్యంలో విషపూరిత ద్రావకం కలుపుకుని తాగారు. అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పావగడ పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జ్యోతి మరణించినట్లు నిర్ధారించుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోవిందరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఉదయం 11 గంటలకు గోవిందరెడ్డి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతురాలు జ్యోతి తల్లిదండ్రులు బెంగుళూరు నుంచి పావగడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. కాగా, ప్రేమికుల ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment