నట్టేట ముంచిన నాసిరకం కలుపు మందు
డి హీరేహాళ్(రాయదుర్గం): నాసిరకం కలుపు మందు నట్టేట ముంచిందని బాధిత రైతు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు... డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామానికి చెందిన రైతు మురళీమోహన్‌రెడ్డి ఆరు ఎకరాల్లో టమాట సాగు చేశాడు. పెట్టుబడి కోసం ఇప్పటికే రూ.5 లక్షలు ఖర్చుచేశాడు. కలుపు నివారణ చర్యల్లో భాగంగా రాయదుర్గం లోని గ్రోమర్ దుకాణంలో టర్క సూపర్ అనే కలుపు మందు కొనుగోలు చేశాడు. దుకాణ నిర్వాహకుల సూచన మేరకు ఎకరాకు 250 ఎంఎల్ చొప్పున పిచికారీ చేశారు. సాయంత్రానికే పైరు మొత్తం కాలి వాలి పోయింది. నాసిరకం కలుపు మందే నట్టేట ముంచిందంటూ గ్రోమర్ సిబ్బందిని గట్టిగా నిలదీశారు. న్యాయం చేయకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాల్సి వస్తోందని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఉద్యాన శాఖ అధికారి మౌనిక, ఆగ్రోస్ సిబ్బంది పొలాన్ని సందర్శించారు. పంటను కాపాడే బాధ్యత తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ రైతుకు సర్ధిచెప్పారు. వారం రోజుల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మొక్కలను కాపాడేందుకు అవసరమైన మందులను డ్రిప్ ద్వారా సరఫరా చేయించారు.
ఆరు ఎకరాల్లో తుడిచిపెట్టుకు పోయిన టమాట పంట
Comments
Please login to add a commentAdd a comment