ఆదాయం.. అందనంత దూరం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలకూ ప్రోత్సాహం లభించింది. ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలను ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే స్థిరాస్తి రంగానికి ఊపు వచ్చి ఆదాయ వనరులన్నీ బాగుండేవి. జీఎస్టీ వసూళ్లు ఊహించిన దానికంటే మించి ఉండటంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే, గత ఏడు నెలలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిస్థితి తిరగబడింది. ఆదాయ వనరులన్నీ మూసుకు పోయాయి. కనీస లక్ష్యాలు కూడా అందుకోవడం కష్టమైంది. దీంతో అధికార యంత్రాంగానికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
పడిపోయిన జీఎస్టీ వసూళ్లు..
ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఆదాయ వనరు జీఎస్టీ (గూడ్స్‌అండ్ సర్వీసెస్ ట్యాక్స్)నే. 2019–23 మధ్యకాలంలో సగటున నెలకు జీఎస్టీ వసూళ్లు రూ.550 కోట్లు ఉండేవి. ఇప్పుడు రూ.300 కోట్లు కూడా రావడం లేదు. చివరకు పన్నులు వసూళ్లు కాక మూడు వందల మందికి పైగా నోటీసులు ఇచ్చారు. మరోవైపు వ్యాపారాలు లేవని, పన్నులు కట్టే పరిస్థితి లేదని వ్యాపారులు వాపోతున్నారు.
‘స్థిరాస్తి’ కుదేలు
ఉమ్మడి జిల్లాలో స్థిరాస్తి రంగం కుదైలేంది. ఒకప్పుడు కళకళలాడిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నేడు బోసిపోతున్నాయి. రోజుకు నాలుగైదు డాక్యుమెంట్లు వచ్చినా చాలురా దేవుడా అనే పరిస్థితి వచ్చింది. అనంతపురం జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.469 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకూ కేవలం రూ.142 కోట్లు వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.248 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.85 కోట్లు వసూలైంది.
‘కియా’ నుంచి అంతంతే..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ‘కియా’ కార్ల కంపెనీ నుంచి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉంటోందని జీఎస్టీ నిపుణులు చెబుతున్నారు. ప్రతి వంద కార్ల ఉత్పత్తిలో ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నది కేవలం 2 కార్లే అని, మిగతా కార్లు ఎగుమతి అవుతుండటంతో స్టేట్ జీఎస్టీ పరిధిలోకి రాదని చెబుతున్నారు. దీంతో ఆదాయం చాలా తక్కువగా ఉందంటున్నారు.
ఆటోమొబైల్ రంగం కుదేలు..
గతంలో ఎప్పుడూ లేనంతగా ఆటోమొబైల్ రంగం పడిపోయినట్టు వాహన డీలర్లు చెబుతున్నారు. 2023–24తో పోలిస్తే 40 శాతం అమ్మకాలు కూడా జరగలేదని వాపోతున్నారు. కార్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఎప్పుడూ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లతో రద్దీగా ఉండే మార్కెట్ ఈ సారి కళ తప్పింది. గతంలో ఆటోమొబైల్ రంగం నుంచి భారీగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుండేది. అలాంటిది ఇప్పుడు డీలా పడినట్టు తెలుస్తోంది. దీంతో పాటు డీజిల్, పెట్రోల్ నుంచి కూడా అనుకున్న మేర సేల్స్ ట్యాక్స్ రావడం లేదని తేలింది.
ఉమ్మడి జిల్లాలో దారుణంగా పరిస్థితి
కోలుకోని స్థిరాస్తి రంగం
అధ్వానంగా జీఎస్టీ వసూళ్లు
భారీగా పడిపోయిన
‘ఆటోమొబైల్’ అమ్మకాలు
ఇతర రంగాల ఆదాయం కూడా
52 శాతం తగ్గుదల
‘కియా’ నుంచి నామమాత్రపు
ఆదాయంతో సరి!
Comments
Please login to add a commentAdd a comment