పుట్టపర్తి అర్బన్: పేదరికంలో మగ్గుతున్న వారిని మాయదారి రోగాలు చుట్టుముట్టడంతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి వారికి భరోసా ఇచ్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ల తొలగింపు ప్రారంభించింది. తాజాగా గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా రెండో విడత పింఛన్ల పరిశీలన ప్రారంభమవుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
రీవెరిఫికేషన్ పేరుతో...
వివిధ రోగాల బారిన పడి మంచాన పడిన వారికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.10 వేలు పింఛన్ ఇచ్చేవారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే వారి పింఛన్ రూ.15 వేలకు పెంచి పంపిణీ చేస్తోంది. అయితే పింఛన్ల మొత్తాన్ని ఇవ్వలేక పింఛన్ల ఏరివేతకు 5 బృందాలను నియమించడం ఇప్పుడు అలజడికి కారణమైంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించిన వైద్య బృందాలు సుమారు 386 లబ్ధిదారులను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో రూ.15 వేలు పింఛన్ల మొత్తం తీసుకుంటున్న లబ్ధిదారులు 1715 మంది ఉన్నారు. ఇప్పుడు రీ వెరిఫికేషన్ పేరుతో మరోసారి వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు. సర్టిఫికెట్లలో తేడాలు ఉన్నా, రోగులు అందుబాటులో లేకున్నా ఆరోగ్య పరిస్థితి కాస్తా నయమైనా వాటి వివరాలను నమోదు చేసుకొని పింఛన్లను తొలగించనున్నారు.
జిల్లాలో 2,64,475 పింఛన్లు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి జిల్లాలో 2,70,973 పింఛన్లు ఉండగా ప్రస్తుతం జనవరి నెలలో 2,64,475 ఉన్నాయి. కేవలం 7 నెలల కాలంలో సుమారు 6,498 పెన్షన్లు తొలగించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకుండానే ఉన్న వాటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం రూ.15 వేల పింఛన్ల తీసుకుంటున్న లబ్ధిదారులు 1715 మంది, రూ.10 వేలు తీసుకుంటున్న వారు 561 మంది, రూ.6 వేలు తీసుకుంటున్న లబ్ధిదారులు 34,476 మంది ఉన్నారు. విడతల వారీగా పరిశీలన పేరుతో ఇందులో చాలా వరకూ పింఛన్లను తొలగించాలన్నదే ప్రభుత్వ కుట్ర అని స్పష్టమవుతోంది.
పింఛన్ల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి
కొత్తవారికి ఇవ్వకుండా ఉన్న పింఛన్లకు కోత
ఏడు నెలల కాలంలో
6,498 మందికి పింఛన్ కట్
నేటి నుండి రెండో విడత పరిశీలన
మార్చిలోపు పరిశీలన పూర్తి చేస్తాం
ఈ నెలాఖరులోపు రూ.15 వేలు అందుకుంటున్న వారి పింఛన్ల పరిశీలన పూర్తి చేస్తారు. అనంతరం రూ. 10 వేలు, రూ.6 వేలు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల పరిశీలనను మార్చిలోగా పూర్తి చేస్తారు. వాటి నివేదికలు ప్రభుత్వానికి పంపుతారు. ఆ నివేదికలను బట్టి వారికి మరోసారి సదరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు. ప్రస్తుతం అనంతపురంలో సదరం క్యాంపులు సైతం రద్దు చేశారు. పింఛన్ల పరిశీలన పూర్తయిన అనంతరం వాటిని తిరిగి అందజేస్తారు.
– నరసయ్య, పీడీ, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment