సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓ తల్లి ఇచ్చిన ఆదేశం.. పన్నెండు ఎకరాల ప్రాకారం.. ఐదేళ్లుగా సాగుతున్న నిర్మాణం..తిరుమల నుంచి తెచ్చిన ఏకశిలా విగ్రహం.. వెరసి ఓ భక్తుడి కల నెరవేరుతోందిలా. పదేళ్ల కిందట తల్లి వద్దకు వెళ్లి ‘అమ్మా.. స్వామి దర్శనం సంతృప్తిగా జరగలేదు’ అని చెబితే.. ఇక్కడే తిరుమలను పోలిన గుడి కట్టుకోవచ్చు కదా.. అని తల్లి చెప్పింది. అంతే అమ్మ ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఆ తిరుమలేశుని పలాస తీసుకువచ్చే క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లుగా సాగుతున్న ఈ నిర్మాణ క్రతువు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఒడిశా రాజ కుటుంబానికి చెందిన హరి ముకుందా పండా ఈ మహత్కార్యాన్ని నెత్తిన వేసుకుని పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరి ముకుందా పండా తల్లి పేరు హరి విష్ణుప్రియ పండా. నిత్యం దైవ ధ్యాసలో ఉంటూ దానధర్మాలు చేస్తుంటారు. ఆమె ఒక్కగానొక్క కొడుకు హరి ముకుందా పండా. పదేళ్ల కిందట ఆయన మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. కానీ స్వామి దర్శనం సంతృప్తికరంగా జరగలేదని తల్లి వద్ద చెప్పుకుని బాధ పడ్డారు.
దీంతో ఆ తల్లి తన కుమారుడి ఆవేదనను అర్థం చేసుకుని.. తనకున్న కొబ్బరి తోటలోని 12 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టమని చెప్పింది. దాంతో 95 ఏళ్ల వయస్సులో ఉన్న హరి ముకుందా ఐదేళ్ల కిందట నిర్మాణాన్ని ప్రారంభించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అతి పెద్ద పండ్లతోట పండావారి తోటగా ప్రసిద్ధి చెందింది. దానికి యజమాని హరిముకుంద పండా. ఆయనే ప్రస్తుతం అందమైన ఆలయాన్ని నిర్మించి వేంకటేశ్వరస్వామిపై తన దైన శైలిలో భక్తి భావం చాటుకుంటున్న దార్శనికుడిగా చరిత్రలో నిలిచిపోతున్నారు.
రూ.5 కోట్లకుపైగా నిధులతో..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందలాది దేవతామూర్తుల విగ్రహాలతో అద్బుతమైన కట్టడాలకు చిరునామాగా పలాస మారనుంది. అందుకు ఒక్క రూపాయి చందా తీసుకోకుండా తిరుమలలో ఉన్న వేంకటేశ్వరస్వామి విగ్రహంతో సమానమైన ఏకశిల విగ్రహాన్ని (తొమ్మిదిఅడుగుల) తయారు చేయించి తిరుపతి నుంచే తెప్పించారు. ఆలయంలో ప్రత్యేకతలు ఒడిశా సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి. ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరి ముకుందా పండా వయసుమీద పడుతున్నా హైందవ ధర్మంపై అపారమైన నమ్మకంతో ఈ యజ్ఞానికి పూనుకున్నారు. 12 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయంలో కోనేరును సైతం నిర్మిస్తున్నారు. దానికి ఎదురుగా నిరుపేదల పెళ్లిళ్లకు ఉపయోగపడే విధంగా రెండు ఎకరాల్లో కల్యాణమండపం నిర్మించి టీటీడీకి అందివ్వనున్నారు. ఇప్పటికే రెండెకరాలు భూమిని టీటీడీకి రాసేశారు.
వారానికి లక్షల్లో పింఛన్లు పంపిణీ..
ఒక్క దేవాలయం నిర్మాణంతోనే తన ఔదార్యాన్ని పరిమితం చేయలేదు. తన వద్దకు వచ్చే ఎంతోమంది పేదవాళ్లకు సాయం కూడా చేస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దే కాకుండా రాష్ట్రంలో, దేశంలో ఏ మూలనుంచి వచ్చినా వారానికి ఒక్కసారి కడుపు నిండా భోజనం పెట్టి.. దివ్యాంగత్వాన్ని బట్టి పింఛన్లు అందిస్తున్నారు. ప్రతి సోమవారం పండాతోట నుంచి పలాస రైల్వేస్టేషన్‌కు ఒక ప్రత్యేక ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి దివ్యాంగుల రాకపోకలకు సౌకర్యం కల్పిస్తున్నారు. వారానికి 200మందికి భోజనంతో పాటు రూ.లక్షల్లో పింఛన్లు అందజేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రాలేనివారికి ఏడాదికి రూ.10వేలు డిపాజిట్ చేస్తున్నారు. రెండు కాళ్లు, రెండు కళ్లు లేనివారికి మాత్రమే ఇవి అందిస్తున్నారు. ఏనాడూ ప్రచారాలకు పోకుండా... రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవ చేస్తున్నారు.
తనయుడి ఆచరణ
వయసు శరీరానికే తప్ప మనసుకు మాత్రం కాదని ఆయన నిరూపిస్తున్నా రు. బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారి 3గంటలకు లేచి దినచర్యను ప్రారంభించే ఆయన ప్రకృతికి దగ్గరగా ఉంటారు. యోగా ప్రాణాయామంతో పాటు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ఆలయానికి వచ్చి రాత్రి నిద్రపోయే వరకు ఆలయం నిర్మాణంలోనే మమేకమవుతున్నారు. మధ్యలో వ్యవసాయ పనులు చేస్తుంటారు. తోట లో ట్రాక్టర్‌ను తానే నడుపుతూ అన్ని పనులు చేసి పూర్వపు ఆహార అలవాట్లు పాటిస్తున్నారు. కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తారు. ఎలాంటి మందులు వాడకుండా పండించే వివిధ రకాల పండ్లను కొనుగోలు చేయడానికి ఆయన తోట వద్ద క్యూ కడుతుంటారు. పన్నెండేళ్ల వయస్సులో స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈయనొక కుమారుడు ఉన్నారు. ఆయన వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. హరి ముకుంద తర్వాత ఆలయ బాధ్యతలు ఆయనే చూసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment