కష్టాల ముగ్గు | - | Sakshi
Sakshi News home page

కష్టాల ముగ్గు

Published Thu, Jan 2 2025 12:58 AM | Last Updated on Thu, Jan 2 2025 12:58 AM

కష్టా

కష్టాల ముగ్గు

వీధి అరుగుపై ఓ ముగ్గు వేస్తే.. వారి కంచంలో అన్నం పడినట్టే. ఓ చోట ఉత్సాహంగా రంగవల్లికల పోటీలు జరిగితే.. వారికో నెలపాటు కడుపు నిండినట్టే. ముగ్గు చుక్కలు కలుపుతున్నంత సేపూ వారి బతుకులకు మెతుకులు దొరికినట్టే. కొండరాళ్లను పిండి చేసి తయారు చేసే ఈ ముగ్గు పిండి వెనుక కనిపించని బతుకులు దాగి ఉన్నాయి. రంగురంగుల తళుకుల వెనుక కాలే కడుపుల కష్టాలు ఉన్నాయి.

గిరాకీ తగ్గింది

నా భర్త పిండి వృత్తి చేసి కుటుంబాన్ని పోషించేవారు. అనారోగ్యంతో 20 ఏళ్ల కిందటే మృతిచెందారు. అప్పటి నుంచి నేను నా కొడుకు అదే వృత్తిచేసి జీవించాం. కొన్నాళ్ల తర్వాత గ్యాస్‌పిండి అని మరోరకం పిండి రావడంతో మాకు గిరాకీ తగ్గింది. రోజంతా కష్టపడినా గిట్టుబాటు కావడంలేదు. మానేసి ఉపాధిహామీ పనులు చేసుకుంటున్నాం. – గాసి జయమ్మ,

మెళియాపుట్టి గ్రామం

● కొండ రాళ్లను తవ్వి ముగ్గు పిండి తయారీ

● ఆంధ్రా, ఒడిశాలో విక్రయాలు

● ఇదే ఆధారం అంటున్న దళిత కుటుంబాలు

● డిసెంబర్‌, జనవరి నెలల్లోనే అమ్మకాలు

మెళియాపుట్టి:

మండల కేంద్రంలో సుమారు 40 దళిత కుటుంబాలు ముగ్గు పిండి తవ్వి బతుకుతున్నాయి. సంక్రాంతి వస్తుదంటే వీరికి మంచి ఆదాయం లభించేది. కానీ ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ పనిలో ఉన్నాయి. మెళియాపుట్టిలోని కొండపై ఉన్న పెద్ద పెద్ద రాళ్లను తవ్వి వాటి నుంచి వచ్చే పిండిని విక్రయిస్తారు. దీంతో ఇళ్ల ముందు సంక్రాంతి ముగ్గులు మెరిసిపోతాయి. ప్రస్తుతం వీరిలో కొన్ని కుటుంబాల వారు ఈ వృత్తిని మానేశారు.

మండే ఎండలో..

కొండ రాయిని పిండి చేయడం అంటే ఆషామాషీ కాదు. పనిలో వీరు మండుటెండను సైతం లెక్కచేయరు. ఈ వృత్తి చేయాలంటే బలం ఉండాలి. ఆరోగ్యం చెడితే ఈ పనికి పనికిరారు. వృత్తి చేస్తున్న వారు కొంతమంది పక్షవాతానికి గురై చనిపోయారు కూడా. వీరు చేసే పనికి ఓ కార్మిక చట్టం వర్తించదు. ఏ సంక్షేమ పథకం దరి చేరదు. వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. కొందరు వ్యక్తులు వృత్తిని మానేసి ఇతర పనులు చేసుకుంటున్నారు. మన జిల్లాలో ఈ వృత్తి చేస్తున్న వారు లేరు. ఇలాంటి రాళ్ల పిండి దొరకడం కూడా కష్టమైపోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో వీరి పిండికి గిరాకీ తగ్గి గ్యాస్‌ పిండి మార్కెట్లోకి వచ్చింది. ముందులా ధర పలకలడం లేదని వారు వాపోతున్నారు.

ఎలా తయారు చేస్తారంటే..?

మెళియాపుట్టి గ్రామం నుంచి సుమారు కిలోమీటర్‌ దూరం కొండపైకి వెళ్లి సుద్ద రాళ్లను తవ్వి రోడ్ల పైకి తీసుకొచ్చి కర్రలతో కొట్టి పిండి చేస్తారు. బాగా ఆరిన తర్వాత జల్లెడతో జల్లిస్తారు. మండతున్న ఎండలో రోడ్లపై పిండి చేసేటప్పుడు వాహనాల రాకపోకల్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఒడిశాలోని పర్లాభిమిడి, బరంపూర్‌ వరకూ వెళ్లి విక్రయిస్తారు. ఈ పిండి ఆయుర్వేద ఔషధం వంటిదని, కీటకాలను దూరం చేస్తుందని ఒడిశా వాసులు నమ్ముతారు. అందుకే ఎన్ని రకాల ముగ్గుల రంగులు దొరికినా వారు దీన్నే కొనుగోలు చేస్తారు.

జీవన సమరం

సంక్రాంతికి గిరాకీ ఉండేది

ఒకప్పడు సంక్రాంతి వస్తే చాలు మాకు నెలరోజుల ముందు నుంచే మంచి గిరాకీ ఉండేది. మా ఇళ్ల వద్దకే వచ్చి కొనుక్కుని వెళ్లేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది. నా ఆరోగ్యం చెడిపోయింది. అప్పుడప్పుడు పిండి తవ్వుతున్న, ఇతర సమయాల్లో ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటున్నాను. – తెంబూరు ఎర్రయ్య,

ముగ్గుతయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం

ఇప్పటికీ అదే వృత్తి

పూర్వం నుంచీ ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాను. రెండురోజులకొకసారి కొండకు వెళ్లి పిండి తవ్వుకుని వచ్చి కుటుంబంతో సహా ఆరబెట్టి జల్లించి, పర్లాఖిముడి, సోంపేట ఇతర గ్రామాలకు వెళ్లి విక్రయిస్తాను. రోజుకి రూ. 200 గిట్టుబాటు కావడం కష్టంగా ఉంది. మాకు ప్రభుత్వాలు వేరే దారి చూపించాలి.

– గాసి సూర్యనారాయణ, ముగ్గు పిండి

తయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment
కష్టాల ముగ్గు 1
1/5

కష్టాల ముగ్గు

కష్టాల ముగ్గు 2
2/5

కష్టాల ముగ్గు

కష్టాల ముగ్గు 3
3/5

కష్టాల ముగ్గు

కష్టాల ముగ్గు 4
4/5

కష్టాల ముగ్గు

కష్టాల ముగ్గు 5
5/5

కష్టాల ముగ్గు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement