ఉమిలాడలో జగనన్న లేఅవుట్ ఆక్రమించి మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేస్తున్న దృశ్యం
టీడీపీ నాయకుడి ఘన కార్యం
సరిహద్దు రాళ్లు తొలగించి కంచె ఏర్పాటు
కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
సంతబొమ్మాళి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల అరాచకానికి హద్దు లేకుండా పోయింది. పేదలకు కేటాయించిన జగనన్న కాలనీపై కన్నేసిన ఘటన ఉమిలాడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉమిలాడ గ్రామంలో 2020 సంవత్సరంలో సర్వే నంబర్ 185లో ఎకరా పైబడి ప్రభుత్వ భూమిని జగనన్న లేఅవుట్‌కు రెవెన్యూ అధికారులు కేటాయించారు.
ఈ స్థలంలో ఉపాధి హామీ పథకం నిధులతో లేఅవుట్ ఎత్తుచేసి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. తయారైన జగనన్న లేఅవుట్‌లో 22 మంది లబ్ధిదారులు ఇల్లు స్థలాలను కేటాయించి సరిహద్దులను ఏర్పాటు చేశా రు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బొంది పాపారావు ఆ స్థలం తన ఆధీనంలో ఉందంటూ కోర్టును ఆశ్రయించారు.
దీంతో పేదలకు పట్టాలు ఇవ్వడం కుదరలేదు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అప్పటి తహసీల్దార్ చలమయ్య కోర్టుకు విన్నవించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులు నిర్ణయించుకున్నారు. తర్వాత కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు ఆక్రమణ పనిని మొదలుపెట్టారు.
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని జగనన్న లేఅవుట్‌లో వేసిన సరిహద్దు రాళ్లను టీడీపీ నాయకుడు బొంది పాపారావు తొలగించి ఆక్రమించుకున్నారు. జగనన్న లేఅవుట్ చుట్టూ కంచెను ఏర్పాటు చేసి మొక్కలను నాటారు. ఇప్పుడు ఇళ్ల స్థలాలుగా చేసి అమ్మేందుకు బేరసారాలు చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఉమిలాడలో ప్రభుత్వ భూమిలో వేసిన జగనన్న లేఅవుట్ ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. స్థానిక వీఆర్వో, ఇతర సిబ్బందికి అడిగి తెలుసుకుంటాను. దీనిపై ఎవరైనా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటాం. – హరిబాబు, డిప్యూటీ తహసీల్దార్, సంతబొమ్మాళి
Comments
Please login to add a commentAdd a comment