అన్నదాత కంటతడి
ఆరని తడి..
తడిచిన వరి కుప్పలను చూపిస్తున్న చిన్నారావు
నరసన్నపేట: అల్పపీడనం, వాయుగుండం కారణంగా పది రోజులపాటు కొనసాగిన ముసురు వాతావరణం రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ఆలస్యంగా ఉభాలు చేసిన రైతులు ఈ ముసురుకు దొరికిపోయారు. అధికారులు మాటలు నమ్మి కోతలు కోయకుండా ఉన్న వారంతా బాగా నష్టపోయారు. నిరంతరాయంగా కురిసిన చినుకులకు పొలాల్లో ఉన్న వరి కుప్పలు తడిచి ముద్దయ్యాయి. వాతావరణం మారిన తర్వాత పొలాల్లోకి వెళ్లిన వరి కుప్పలు పరిశీలించిన రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పాడైన, కోయని వరి పొలాలను పరిగణనలోనికి తీసుకోని వ్యవసాయ అధికారులు.. ఈ కుప్పలు గురించి అసలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నరసన్నపేట మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వాతావరణం చక్కబడిన తరువాత నూర్పు చేసుకోవచ్చని ఆశించిన రైతులు పొలాల్లోనే కుప్పలు పెట్టారు. ఇప్పుడవి కూడా వర్షానికి తడిచి ముద్దయ్యాయి. జగన్నాథపురానికి చెందిన పట్నాన చి న్నారావు తడిచిన వరి కుప్పలు చూసి బుధవారం కంటతడి పెట్టారు. తడిచి పోయి ధాన్యం మొలకలు వస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంచి ధర పలుకుతుందని సాంబ రకం పండించానని, ఇప్పుడు వర్షానికి తడిచిపోయిందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. వర్షాలకు నష్టాలను నమోదు చేశారా.. అని స్థానిక వ్యవసాయశాఖ ఏడీ రవీంద్రభారతి వద్ద ప్రస్తావించగా నరసన్నపేట ప్రాంతంలో ఎటువంటి నష్టం జరగలేదని, గుర్తించలేదని చెప్పడం గమనార్హం.
ముక్కిపోయిన పంటను చూసి
విలపించిన రైతన్న
అధికారుల నిర్వాకమే కారణమని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment