నేడు జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరగనున్న జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య కోరారు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభంకానుందని ఆయన చెప్పారు. ఈ మేరకు సైన్స్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ప్రధాన వేదికతోపాటు మండలాల నుంచి రానున్న ప్రదర్శనల గురించి ఆరా తీశారు. ఏక విద్యార్థి, విద్యార్థుల సమూహం, టీచర్ కాన్సెప్ట్ మూడు కేటగిరిల్లో డిసెంబర్ 30వ తేదీన మండలస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో మూడు కేటగిరీల్లో విజేతలుగా నిలిచినవారు జిల్లాస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని కార్యక్రమ నోడల్ అధికారి, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమార్ తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి ఆధ్వర్యంలో కమీటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తోపాటు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు డీఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment