మామిడివానిపేట గ్రామంలో ఇంటి పునాదులు జేసీబీతో తొలిగిస్తున్న దృశ్యం
జగనన్న కాలనీలో జియోట్యాగింగ్ లేదని పునాదులు తొలగించే ప్రయత్నం
కోటబొమ్మాళి మండలం యలమంచిలి పంచాయతీలో సంఘటన
అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, గ్రామస్తులు
టెక్కలి: తమ ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని మంత్రి కె.అచ్చెన్నాయుడు పలు బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారనే అక్కసుతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు అదుపు లేకుండా పోతోంది.
తాజాగా గురువారం కోటబొమ్మాళి మండలం యలమంచిలి పంచాయతీ మామిడివానిపేట గ్రామంలో జగనన్న కాలనీలో వీరఘట్టపు రజని కుటుంబానికి చెందిన ఇంటి పునాదులను తొలగించే ప్రయత్నం చేశారు. జియోట్యాగింగ్ చేయలేదనే సాకుతో రెవెన్యూ అధికారులు కూల్చివేసే ప్రయత్నాలు చేశారు. దీంతో పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కె.రామరాజు, ఎంపీటీసీ హెచ్.గోవిందరావు, గ్రామస్తులు ఎన్.అప్పన్నతో పాటు మరి కొంత మంది నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి పునాదుల కూల్చివేతను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సుమారు 43 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని వారిలో వీరఘట్టపు రజని కుటుంబానికి స్థలంతో పాటు ఇంటి పట్టాను అప్పటి అధికారులు అందజేశారని వెల్లడించారు. రజని భర్త భాస్కరరావు టీడీపీకి వేటు వేయలేదని కక్ష పెట్టుకుని కొందరు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు అధికారులను ఉసిగొల్పారని మండిపడ్డారు. గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఈ విధంగా టీడీపీ కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.
2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ పంచాయతీలో అన్యాయంగా సుమారు 80 మంది వృద్ధుల పింఛన్లు తొలగించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ వర్గానికి చెందినవారందరికీ సంక్షేమ పథకాలు అందజేశారని, కానీ ఇప్పు డు అధికార పక్షం వారు నిరుపేదలపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలను మానుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment