పేదల చదువులు ప్రభుత్వానికి పట్టవా
● వైఎస్సార్‌సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి పేద పిల్లల చదువులంటే లెక్కలేదని వైఎస్సార్‌సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు, కాళింగ కుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల రామారావు (లక్ష్మణరావు) అన్నారు. పట్టణంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ధనిక వర్గాలతో సమానంగా పేదవాడికి నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చిందన్నారు. అయితే దానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడవడం సరికాదన్నారు. విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుడితే, ఈ పథకానికి బాబు సర్కార్ మంగళం పాడడం సరికాదన్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా సర్కార్ లబ్ధిదారులకు తల్లికి వందనం నిధులు విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. యూపీ పాఠశాలలు విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. విలీనం చేయడమంటే బాల కార్మికులను తయారు చేయడమేనని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా మరింత తాత్సారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేసి పేదల విద్యకు సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment