దొంగదారుల్లో ధాన్యం రాక | - | Sakshi
Sakshi News home page

దొంగదారుల్లో ధాన్యం రాక

Published Sat, Dec 14 2024 12:55 AM | Last Updated on Sat, Dec 14 2024 12:55 AM

-

సన్నధాన్యం బోనస్‌ కోసం

వ్యాపారుల తరలింపు

ఇప్పటికే పెద్ద ఎత్తున ధాన్యం

వచ్చినట్లు అంచనా

మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌

మిల్లుల్లో నిల్వలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రా నుంచి తెలంగాణలోకి సన్న ధాన్యం యథేచ్చగా తరలివస్తోంది. పక్క రాష్ట్రం నుంచి ధాన్యం రాకను నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీసు, పౌరసరఫరాల యంత్రాంగం నిర్లిప్తత కారణంగా వందలాదిగా ధాన్యం లారీలు సరిహద్దులు దాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి జిల్లాలోకి వస్తున్నాయి. తెలంగాణలో సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.2320 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ వస్తుండటంతో వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెద్ద ఎత్తున లారీల్లో తెలంగాణకు తరలించి ఇక్కడి రైతుల పేరుతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం తెలవారుజామున ధాన్యం తీసుకువస్తున్న లారీలను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో పోలీసులు పట్టుకొని వెనక్కి పంపించి వేయడమే ఇందుకు ఉదాహరణ. అదేకాదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెక్‌పోస్టులు లేని నాలుగైదు ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని వ్యాపారులు తరలించి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని మిల్లుల్లో డంప్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఒక్క చెక్‌పోస్టు వద్దే 131 లారీలు అడ్డగింత

ప్రస్తుతం నాగార్జునసాగర్‌, వాడపల్లి, కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద అంతర్రాష్ట చెక్‌ పోస్టులు ఉండగా, మేళ్లచెరువు మండలం రామాపురం వద్ద నెల రోజుల కిందటే చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఆర్ధరాత్రి వేళల్లో ఆయా చెక్‌ పోస్టుల వద్ద అక్కడి సిబ్బందిని మేనేజ్‌ చేసి వ్యాపారులు ఆంధ్రా ధాన్యాన్ని తెలంగాణలోకి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద నవంబరు 16న చెక్‌పోస్టును ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన 131 లారీలను అడ్డుకొని వెనక్కి పంపించారంటే, రాష్ట్రంలోకి ప్రవేశించినవి ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

చెక్‌ పోస్టులే లేని ఆ నాలుగు

ప్రాంతాల నుంచి అధికంగా..

ఆంధ్రా నుంచి తెలంగాణలోకి చెక్‌ పోస్టులు అసలే లేని నాలుగు ప్రాంతాలు సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఉన్నాయి. వాటి ద్వారానే పెద్ద ఎత్తుల ధాన్యం లారీలను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదాడ మీదుగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం.. అక్కడి నుంచి మేళ్లచెరువుకు లారీలు వస్తుండటంతో నెల రోజుల కిందట చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అదికాకుండా ఎన్‌టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నుంచి మక్త్యాల మీదుగా సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడు మీదుగా మేళ్లచెరువు మండలం రేవూరులో ప్రవేశించి మేళ్లచెరువు మీదుగా పెద్ద ఎత్తున ధాన్యం తరలిస్తున్నారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు గురువారం చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం నుంచి పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జీ మీదుగా కూడా వస్తున్నాయి.

ఫ జగ్గయ్యపేట నుంచి కోదాడ మండలంలోని అన్నారానికి, అక్కడి నుండి కోదాడ మండలంలోని రెడ్లకుంట, కాపుగల్లు, గుడిబండ మీదుగా కోదాడ బైపాస్‌ రోడ్డుకు ధాన్యం చేరుస్తున్నారు.

ఫ మరికొంత మంది కృష్ణాజిల్లా గరికపాడు నుంచి తక్కెళ్లపాడు మీదుగా అనంతగిరి మండలంలోని గోండ్రియాల మీదుగా కోదాడకు, కోదాడ–ఖమ్మం రోడ్డుమీదుగా ఖమ్మంకు ధాన్యం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఇతర శాఖల అధికారులు కేవలం జాతీయ రహదారి, చెక్‌పోస్టులు ఉన్న ఇతర ప్రాంతాల్లో అడపాదడపా చేస్తూ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ధాన్యం జిల్లాలో డంప్‌ చేసినట్లు తెలిసింది.

గురువారం తెల్లవారుజామున మేళ్లచెరువులో పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపిన లారీలు

అక్కడ చెక్‌పోస్టు పెట్టినా సిబ్బంది తక్కువే..

కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు, నాగార్జునసాగర్‌, వాడపల్లి చెక్‌ పోస్టుల నుంచి ధాన్యం పెద్ద ఎత్తున తరలించే వీలు లేదు. అర్ధరాత్రి వేళల్లో అక్కడ డ్యూటీలో సిబ్బందిని మేనేజ్‌ చేసుకొని కొంతమేర తలిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్టానదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా లారీల్లోనూ ధాన్యం తరలిస్తున్నట్లు తెలిసింది. అక్కడ తక్కువ సంఖ్యలో ఉంటుండటంతో ఆ ప్రాంతం నుంచి ధాన్యం లారీలు మఠంపల్లి మండల కేంద్రం మీదుగా హుజూర్‌నగర్‌వైపు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement