భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వ్యవసాయ గణనను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. దేశంలో ఏ రకమైన రైతులు.. ఎంతమంది ఉన్నారు.. ఎవరికి ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే విషయాలు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రతి అయిదేళ్లకోసారి వ్యవసాయ గణన చేపడుతోంది. ఈ గణన రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన పథకాలను రూపొందించి అమలు చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలో ఇప్పటికే మొదటి దశ గణన పూర్తయింది. రెండు, మూడో దశల వ్యవసాయ గణనకు సంబంధించి ఈనెల 18న ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు నాటికి గణన పూర్తి చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.
మూడుదశల్లో..
వ్యవసాయ గణన కార్యక్రమం మూడు దశల్లో జరగనుంది. మొదటిది సామాజిక వర్గంగా, రెండోది సన్న, చిన్నకారు రైతుల విస్తీర్ణం పరంగా, మూడోది సీ్త్ర, పురుషుల వారీగా గణన చేపట్టనున్నారు. దీంతో దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలోని రైతులకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయి..? ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి..? ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలనే నిర్ణయం కేంద్రం తీసుకోనుంది. మొదటి దశ గణనను పూర్తి చేశారు. జిల్లాలోని రెవెన్యూ గ్రామాల వారీగా సన్న, చిన్నకారు, మధ్య తరగతి, పెద్ద రైతుల వివరాలు, వారి సామాజిక వర్గం, వారికి ఉన్న భూముల వివరాలను సేకరించారు. ఇక రెండోదశలో జిల్లాలో 20 శాతం రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి.. అక్కడ సన్న, చిన్నకారు, పెద్ద రైతుల భూముల్లో సాగు విస్తీర్ణం, సర్వే నంబర్ల వారీగా వివరాలు, ఆయా భూముల్లో ఏ రకమైన పంటలు పండించారు.? వాటికి ఏ రకమైన నీటి వసతులు ఉన్నాయి..? ఏ రకమైన పంటలు పండిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు. మూడోదశలో జిల్లాలోని 7శాతం రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి.. ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలకు ఉపయోగించిన వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరికరాలు, వాటికి అవసరమైన వనరులను ఎక్కడి నుంచి సేకరించారనేది తెలుసుకోనున్నారు.
నెలాఖరు నాటికి పూర్తి
జిల్లాలో ఇప్పటికే మొదటి దశ వ్యవసాయ గణనను పూర్తి చేశాం. ప్రస్తుతం రెండు, మూడు దశల గణన చేసే సిబ్బందికి ఈనెల 18న కలెక్టరేట్‌లో శిక్షణ ఇస్తాం. అనంతరం ఈ నెలాఖరు నాటికి వ్యవసాయ గణన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
–కిషన్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి
వ్యవసాయ గణన ముమ్మరం
ఫ రైతులు, సామాజిక వర్గం,
భూములు, పంటల వివరాల సేకరణ
ఫ ఇప్పటికే మొదటిదశ పూర్తి
ఫ రెండు, మూడు దశల గణనకు
18న ఎన్యుమరేట్లకు శిక్షణ
ఫ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు
75మంది ఎన్యుమరేటర్లు, 23 మంది సూపర్‌వైజర్లకు..
జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రెండు, మూడుదశల వ్యవసాయ గణన నిర్వహించేందుకు గాను ఈనెల 18వ తేదీన కలెక్టరేట్‌లో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. 75 మంది ఎన్యుమరేటర్లు, 23 మంది సూపర్‌వైజర్లు ఈ శిక్షణకు హాజరు కానున్నారు. గతంలో నిర్వహించిన వ్యవసాయ గణన కార్యక్రమం పూర్తిగా మాన్యువల్‌గా చేపట్టారు. ప్రస్తుత గణనను మాత్రం పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. సెల్‌ఫోన్‌తోపాటు ట్యాబ్‌లో ఉండే యాప్ ద్వారా వ్యవసాయ గణన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో నేరుగా సంబంధిత శాఖకు రైతుల వివరాలు వెళ్లనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment