నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా
● అవంతీపురం పంప్‌హౌస్‌లో
మరమ్మతులు
● నేటి సాయంత్రం వరకు
నీరందిస్తాం : ఈఈ
సూర్యాపేట: మిర్యాలగూడ మండలం అవంతీపురం వద్ద ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పంప్‌హౌస్‌లో పంపింగ్ మ్యాన్‌ఫోల్డ్ గ్యాస్‌కిట్ సోమవారం మధ్యాహ్నం ఫెయిల్ కావడంతో నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేయిస్తున్నామని మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పంప్‌హౌస్ నుంచి సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద నీటిశుద్ధి కేంద్రానికి నీటి సరఫరా ఆగిందని పేర్కొన్నారు. తద్వారా ఈ కేంద్రం పరిధిలోని సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలతోపాటు చిలుకూరు, కోదాడ, అనంతగిరి, నడిగూడెం, పెన్‌పహాడ్, సూర్యాపేట మండలాల్లోని 187కు పైగా గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్టు వివరించారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు బయలుదేరిన విద్యార్థులు
కోదాడ: ఈ నెల 7,8.9 తేదీల్లో జడ్చర్లలో జరిగే రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఎంపికై న 23 ప్రాజెక్టుల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు సోమవారం కోదాడ నుంచి బయలుదేరి వెళ్లారు. గత నెలలో కోదాడలో జరిగిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపికై న ప్రాజెక్టులు, వాటిని తయారు చేసిన విద్యార్థులతో పాటు గైడ్ టీచర్‌లు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్, బాలుర పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం మార్కెండేయ, ఉపాధ్యాయులు దండాల మధుసూదన్‌రెడ్డి, ఈ. శ్రీనివాసరెడ్డి, బడుగుల సైదులు పాల్గొన్నారు.
8న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ డ్రైవ్
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో జెన్‌పాక్ట్ కంపెనీ వారు ఈ నెల 8న క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ గంగాధర్‌రావు, సెక్రటరీ వి.సత్యేందర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు ముత్యాల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025లో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, ఎంపికై నవారికి వార్షిక వేతనం రూ.2.8లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
పథకాలన్నీ ప్రజలకు
అందేలా చూడాలి
చివ్వెంల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ సామాన్య ప్రజలకు అందేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సభ్యులు కృషిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు లోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో చట్టాలపై డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్ కుమార్, న్యాయవాదులు మారపాక వెంకన్న, సుంకర రవికుమార్ పాల్గొన్నారు.
ధరల నియంత్రణలో విఫలం
భానుపురి (సూర్యాపేట) : నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. సోమవారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ఐద్వా సూర్యాపేట జిల్లా వర్క్ షాప్‌లో ఆమె మాట్లాడారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ వర్క్ షాప్ లో మద్దెల జ్యోతి , సైదమ్మ, విజయలక్ష్మి, నారాయణమ్మ, త్రివేణి, సుందరి రమాదేవి, నెమ్మాది లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment