10 లక్షల జనాభాకు ఓ మెడికల్‌ కాలేజీ | NMC draft guidelines on setting up of new medical colleges | Sakshi
Sakshi News home page

10 లక్షల జనాభాకు ఓ మెడికల్‌ కాలేజీ

Published Mon, Jun 26 2023 3:13 AM | Last Updated on Mon, Jun 26 2023 8:51 AM

NMC draft guidelines on setting up of new medical colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 10 లక్షల జనాభా కలిగిన ప్రాంతంలో కొత్త మెడికల్‌ కాలేజీ స్థాపన కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎలాంటి మెడికల్‌ కాలేజీ ఉనికిలో ఉండకూడదని పేర్కొంది. కొత్త మెడికల్‌ కాలేజీ స్థాపన నిబంధనలు, ఎంబీబీఎస్‌లో సీట్ల పెంపుదలకు సంబంధించి ఎన్‌ఎంసీ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది.

2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొంది. కొత్త మెడికల్‌ కాలేజీలకు 50/100/150 సీట్ల వరకే అనుమతి ఇస్తామని, అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయించబోమని పేర్కొంది. అయితే గతంలోనే అధిక సీట్ల కోసం (150కు మించి) దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిగణలోకి తీసుకుంటామంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న కాలేజీలకు మాత్రమే ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటాయని పేర్కొంది.  

గ్రామీణ ప్రాంత ఆసుపత్రులతో అనుసంధానం 
కొత్తగా అనుమతి తీసుకునే మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాలు/ కమ్యూనిటీ హెల్త్‌/ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉండాలి. ఒక్కో కేంద్రానికి 15 మంది విద్యార్థులను ఇంటర్న్‌గా పంపేలా ఉండాలి. ఈ కేంద్రాలు మెడికల్‌ కాలేజీ యాజమాన్యంలో లేదా ప్రభుత్వంలోని ఆరోగ్య కేంద్రానికి చెందినవిగా ఉండాలి. నగరాల్లో మినహా ఈ ఆరోగ్య కేంద్రాలు 30 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అల్పాహారం, సాంస్కృతిక కార్యకలాపాలు, యోగా శిక్షణ, ఇండోర్‌ గేమ్స్, కౌన్సెలింగ్‌ సదుపాయాలు ఉండాలి.   

బయోమెట్రిక్‌ హాజరు 
మెడికల్‌ కాలేజీల్లో ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్‌ఎంసీ సూచించింది. దీని పరిధిలోకి అధ్యాపకులు, ట్యూటర్లు, సీనియర్‌ రెసిడెంట్లు వస్తారు. హాజరును సరిగా పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి. అన్ని కాలేజీల బయోమెట్రిక్‌ మెషీన్లను ఎన్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కి అనుసంధానం చేయాలి. ప్రతీ మెడికల్‌ కాలేజీ సీసీటీవీ వ్యవస్థ కలిగి ఉండాలి. అధునాతన సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఉండాలి.

కొత్త మార్గదర్శకాలివీ.. 
30 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న స్థలమైతే అందులో భవన నిర్మాణాలు చేపట్టాలి.  
 కాలేజీ, బోధనాసుపత్రులకు వేర్వేరు భవనాలు ఉన్నట్లయితే వాటి మధ్య దూరం గరిష్టంగా 30 నిమిషాల్లో చేరేలా ఉండాలి.  
 ఆసుపత్రిలో కనీసం 220 పడకలుండాలి.  
ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల కోసం ఏర్పాటు చేసే కాలేజీలో తప్పనిసరిగా అనాటమీ, ఫిజియా లజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియా ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, నేత్ర వైద్యం, గైనకాలజీ, అనస్థీషియాలజీ, డెంటిస్ట్రీ, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్, అత్యవసర వైద్యం, ఇంటిగ్రేటివ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement