సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం | CM KCR To Performing Raja Shyamala Yagam At Erravelli | Sakshi
Sakshi News home page

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

Published Wed, Nov 1 2023 2:44 PM | Last Updated on Wed, Nov 1 2023 3:12 PM

CM KCR To Performing Raja Shyamala Yagam At Erravelli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద మూడు రోజులపాటు ఈ యాగం చేయనున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం ఈ రాజశ్యామల యాగానికి అంకురార్పణ జరిగింది. 

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్‌ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. ఈ యాగం మహా శక్తివంతమైనదని తెలిపారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అని పేర్కొన్నారు. మహాభారతం చదివిన జ్ఞాని, హైందవతత్వం పరిపూర్ణంగా తెలిసిన నేత సీఎం కేసీఆర్‌ అంటూ ప్రశంసలు కరిపించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఈ యాగం చేపట్టారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలని ఆశీస్సులు అందించారు.
చదవండి: బీజేపీకి గడ్డం వివేక్‌ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్‌ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు.  యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్‌ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని చెప్పారు.  యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement