తిరుపతి లీగల్: విధినిర్వహణలోని హోంగార్డుపై దాడి చేసిన కేసులో తిరుపతి పోస్టల్ కాలనీ పులి గోరు అపార్ట్‌మెంట్‌కు చెందిన మేదర మిట్ట విక్రమ్ చౌదరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తిరుపతి ఆరో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ రాణాప్రతాప్ గురువారం తీర్పు చెప్పారు. ఈస్ట్ స్టేషన్ సీఐ రామకృష్ణ, కోర్టు కానిస్టేబుల్ అయ్యప్ప తెలిపిన కేసులోని వివరాల మేరకు... 2015 జూలై మూడో తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో నిందితుడు విక్రమ్ చౌదరి స్థానిక కర్నాల వీధిలో ఓ షాపు ముందు తన కారును నిలిపాడు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో విధినిర్వహణలోని హోంగార్డు ఇర్ల సిద్ధయ్య రోడ్డుపై ఆపిన కారు వద్దకు వచ్చి వివరాలు అడిగాడు. దీంతో నిందితుడు విక్రమ్ చౌదరి కారు డోరు తీయగా హోంగార్డు కిందపడ్డాడు. తర్వాత హోంగార్డు కాలరు పట్టుకుని అతనిపై దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ప్రజలు వచ్చి అతని బారి నుంచి హోంగార్డును కాపాడారు. హోంగార్డు సిద్ధయ్య ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి, నిందితుడు విక్రమ్ చౌదరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి విక్రమ్ చౌదరికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ప్రేమ్ సాగర్ వాదించారు.
వ్యక్తి ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు
నాగలాపురం: రుణదాతల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఒకరిని అరెస్టు చేసినట్టు నాగలాపురం ఎస్‌ఐ సునీల్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. నాగలాపురం సాయినగర్‌లో శేఖర్(62) అనే వ్యక్తి నివాసం ఉండేవారు. ఈ క్రమంలో అదే గ్రామంలోని కుమ్మరవీధికి చెందిన భరత్(28) వద్ద శేఖర్ రూ.11 లక్షలు అప్పు తీసుకున్నాడు. అతను అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో శేఖర్ ఇంటిని భరత్ తన పేర రాయించుకున్నాడు. అంతటితో ఆగక నిత్యం శేఖర్‌ను భరత్ వేధింపులకు గురిచేశాడు. రుణదాత వేధింపులు తాళలేక శేఖర్ ఆరు నెలల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితడు భరత్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేసి, పుత్తూరు కోర్టులో హాజరుపరిచాడు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment