అధికారులకేనా.. ఆదేశాలు!
తిరుపతి అర్బన్ : మాజీ ప్రధాని మన్మోహన్ పరమపదించిన కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సంతాప దినాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 1వ తేదీన కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు పుష్పగుచ్ఛాలు, పండ్లు, కేక్‌లు, గిఫ్ట్‌లతో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకూడదని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టంగా ప్రకటించారు. దీంతో కలెక్టరేట్ న్యూ ఇయర్ వేడులకు దూరంగా ఉండిపోయింది. అలాగే తిరుపతిలోని జిల్లా కార్యాలయాలన్నీ బోసిబోయాయి. వర్కిండే కావడంతో ఉద్యోగులు తమ విధులకు హాజరై వెళ్లిపోయారు. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్‌ను శాలువాలతో సత్కరించారు. గిఫ్ట్ బాక్స్‌లను అందించారు. దీంతో ఆదేశాలు కేవలం అధికారులకేనా.. ప్రజాప్రతినిధులకు వర్తించవా అంటూ పలువురు విమర్శించడం వినిపించింది.
లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ
తిరుపతి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను బుధవారం నుంచి ట్రెజరీల్లో స్వీకరిస్తున్నట్లు జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర్‌రెడ్డి తెలిపారు. పెన్షన్‌దారులు ఫిబ్రవరి ఆఖరులోపు లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ పద్ధతిలో జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చునని వెల్లడించారు. ఆ మేరకు ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబరు, పీపీఓ నంబరు (పింఛన్ పుస్తకం), బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని ట్రెజరీలోగాని, మీసేవ కేంద్రంలోగాని, ఇంటర్నెట్ సెంటర్లోగానీ, పింఛన్‌దారుల సంఘంలోగాని లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
సంస్కృత వర్సిటీలో పదవులు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా ఆగమ విభాగ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వేదాంతం విష్ణుభట్టాచార్యులను నియమిస్తూ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దూర విద్యాకేంద్రం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ చక్రవర్తి రంగనాథన్‌ను, సాహిత్య, సంస్కృతి విభాగం డీన్‌గా ప్రొఫెసర్ సత్యనారాయనాచార్యులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారికి వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాపూరు : మండలంలోని సిద్ధవరం సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన చెలికం శ్రీనివాసులు రెడ్డి(36),పోట్ట శివ పెంచలకోన నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆవుదూడ అడ్డురావడంతో తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున శ్రీనివాసులురెడ్డికి తల రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. క్షతగాత్రుడు శివను 108 వాహనంలో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment