గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
తిరుపతి అర్బన్ : గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ నుంచి శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతోపాటు పలువురు అధికారులతో పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 26న జరిగే 76వ గణతంత్ర సమావేశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తి పర్యావేక్షణ బాధ్యత తిరుపతి ఆర్డీఓ రామమోహన్‌కు అప్పగించామన్నారు. మిగిలిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో డీఆర్వో నరసింహులు, కలెక్టరేట్ ఏఓ భారతి పాల్గొన్నారు.
రిసోర్స్ పర్సన్స్ ఎంపికకు 20 వరకు గడువు
తిరుపతి అర్బన్: సీడాఫ్ వారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో ిపీఎంఫ్‌ఎంఈ అమలుచేయడానికి ప్రతి మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్ ఎంపికను చేపట్టనున్నట్టు డీఆర్‌డీఏ ప్రాజెక్డు డైరెక్టర్ కే.శోభనబాబు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో రిసోర్స్ పర్సన్‌గా పనిచేయడానికి ఏదైనా డిగ్రీ ఉండాలని, 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు, పురుషులు, ట్రాన్స్‌జెండర్లు అర్హులని పేర్కొన్నారు. తెలుగు భాష, కంప్యూటర్ ఉపయోగించే పరిజ్ఞానంతో పాటు, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను మొబిలైజషన్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం లేదా గ్రామీణాభివృద్ధి రంగంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9963561755, 9701387293, 7993502145 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
తాత్కాలిక నియామకాలపై ప్రభుత్వం కన్నెర్ర
తిరుపతి సిటీ : విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వర్సిటీ అధికారులు చేపట్టిన నియామకాలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఈ నెల 20వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని అన్ని వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాదిలో ప్రభుత్వ అనుమతి లేకుండానే పలు వర్సిటీల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 20వతేదీ లోపు అన్ని వర్సిటీలు నివేదికలు ఈ మెయిల్ ద్వారా పంపాలని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టిన ఆర్థిక లావాదేవీల వివరాలను పంపాలని పేర్కొంది. దీంతో జిల్లాలోని వర్సిటీల్లో ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపిన అధికారుల్లో గుబులు నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment