పక్షుల పండగ.. ఏర్పాట్లు దండగ!
● స్టేట్ మెగా ఫెస్టివల్‌గా మారినా ఏర్పాట్లు పేలవం ● పర్యాటకులను అలరించని ఎగ్జిబిషన్ స్టాల్స్
సూళ్లూరుపేట: రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పండుగను స్టేట్ మెగా ఫెస్టివల్‌గా ప్రకటించినా అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేపట్టడంలో విఫలమైంది. ఫ్లెమింగో ఫెస్టివల్–2025ను కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆధ్యరంలో అత్యంత పేలవంగా ప్రారంభించారు. దీని నిర్వహణ కోసం సుమారు రూ.6 కోట్లు మంజూరు చేసినా అందుకు తగినట్టుగా ఏర్పాట్లు మాత్రం కనిపించ లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అత్యంత దారుణంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌స్టాల్స్ పర్యాటకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. గతంలో పండుగ అంటే అట్టహాసంగా చేసి జిల్లాలోని అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులను ఎగ్జిబిషన్‌స్టాల్స్‌లో ప్రదర్శించి పర్యాటకులను ఆకట్టుకునే వారు. ఈ సారి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చూసి పర్యాటకుల నిరుత్సాహంగా పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఉద్యానవనశాఖ స్టాల్ చాల పేలవంగా ఉంది. శాఖల మధ్య సమన్వయం లేక, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ, స్థానిక నాయకుల జోక్యం లేకపోవడంతో ఇలా జరిగి ఉండొచ్చని పర్యాటకులు చర్చించుకుంటున్నారు.
ఆ వీడియో లేదా?
అంతరిక్ష విజ్ఞానం గురించి తెలియచేసేందుకు షార్ కేంద్రం వారు ఏర్పాటు చేసిన స్టాల్ ఈసారి అంతరిక్షం గురించి పర్యాటకులకు చూపించే వీడియో ప్రదర్శన లేకుండా చేశారు. అయితే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే క్రూమాడ్యూల్‌ను ఏర్పాటు చేయడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ సారికొత్తగా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌ను ప్రదర్శించారు. పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ పరవాలేదనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్దగా ఏమీలేకుండా చేశారు. శనివారం సినీతారల సందడి లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment