పక్షుల రక్షణకు ప్రాధాన్యం
● ఫ్లెమింగో ఫెస్టివల్ శ్రీసిటీ స్టాల్స్‌ను ప్రారంభించిన మంత్రి
● ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఏడాదీ సీఎస్‌ఆర్ ద్వారా రూ.కోటి విరాళం : శ్రీసిటీ ఎండీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): సూళ్లూరుపేటలో శనివారం ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్‌లో ఎంపిక చేసిన ఐదు కీలక వేదికల్లో ఒకటైన శ్రీసిటీ జీవవైవిధ్యానికి కార్పొరేట్ సహకారం, సుస్థిరత, ఎకో టూరిజం అంశాలలో వినూత్న ఆలోచనలు రేకెత్తించే సదస్సులకు వేదికగా నిలిచింది. అలాగే సూళ్లూరుపేటలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శ్రీసిటీ ప్రగతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో జరిగిన కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సులో కార్పొరేట్ చొరవ ద్వారా పర్యావరణ నిర్వహణ, సామాజిక స్ఫృహ అనే అంశాలను చర్చించారు. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి సర్కిల్ ఫారెస్ట్ కన్‌జర్వేటర్ సి.సెల్వం, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్) డాక్టర్ సత్యసెల్వం, శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వివిధ పరిశ్రమల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమిష్టిగా వివిధ కీలక అంశాలపై ప్రస్తావించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌లో శ్రీసిటీ పాల్గొనడం సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ పట్ల దాని నిబద్ధతకు నిదర్శనమంటూ కలెక్టర్ వ్యాఖ్యానించారు. పులికాట్ సరస్సు, వలస పక్షుల నివాసాలను రక్షించడానికి కార్పొరేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ బీఎన్‌హెచ్‌ఎస్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ రితే ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం చైర్మన్ శ్రీనిరాజు ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రీసిటీ నిబద్ధతను హైలెట్ చేశారు. సుస్థిర భవిష్యత్తు కోసం పులికాట్ సరస్సు వంటి సంపదను కాపాడుకోవడానికి సమిష్టి, నిరంతర కృషి అవసరమని, ఇందుకోసం ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతో ఉపకరిస్తుందని శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీసిటీ పారిశ్రామిక కుటుంబం తరఫున సీఎస్‌ఆర్ ద్వారా ఏటా రూ.కోటి వెచ్చిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ పరిశ్రమల సీఎస్‌ఆర్ ప్రయత్నాలను అభినందిస్తూ జిల్లా కలెక్టర్, శ్రీనిరాజు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఐఎంఓపీ, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్, కెలాగ్స్, పార్సన్ ప్యాకేజింగ్స్, ఇసుజు మోటార్స్, టీహెచ్‌కే, కోల్గేట్ పామూలిన్, డైకి అల్యూమినియం, బెర్గన్ పైప్స్, డానియల్లీ, అమిల్టన్, అస్ట్రోటెక్, పైలెక్స్, ఎస్‌ఎంసీసీ, వెస్ట్ ఫార్మా పరిశ్రమల అధికారులకు జ్ఞాపికలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment