నేడు సైన్స్ ల్యాబొరేటరీ ప్రారంభం
తిరుపతి క్రైం : తిరుపతిలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని వర్చువల్ విధానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ మణికంఠ చందోలు శనివారం ఈ ల్యాబొరేటరీని పరిశీలించి పలు ఏర్పాట్లు చేశారు. ఇందులో నేరాల విచారణకు ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంటుందని తెలిపారు.
మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
తిరుపతి సిటీ: జీఈఈ మెయిన్–2025 సెషన్–1కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ శనివారం విడుదల చేసింది. ఈనెల 22, 23, 24, 28, 29, 30 తేదీలలో రెండు షిఫ్టులలో జరిగే పరీక్షకు తిరుపతి జిల్లా నుంచి సుమారు 21,650 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలలో మాత్రమే పరీక్షను నిర్వహించనున్నారు. తిరుపతి జూపార్క్ దగ్గర గల ఇయాన్ డిజిటల్ సెంటర్, రంగంపేట కేఎమ్‌ఎమ్ కళాశాల, గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలోని ఎన్‌బీకేఆర్ కళాశాలలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫార్మసీ డిప్లొమో కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఆ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత సాధించిన వారు స్పాట్ అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 23వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు అందించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 98482 17166, 99667 61446, 95506 90007 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు.
ఎట్టకేలకు పరీక్షల షెడ్యూల్ విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ దూరవిద్యా విభాగం యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను ఎట్టకేలకు వర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 3 నుంచి వర్సిటీ డీడీఈ పరిధిలోని అన్ని కేంద్రాలలో నిర్వహించనున్నట్లు అధికారులు శనివారం టైంటేబుల్‌ను విద్యార్థులకు, పరీక్షా కేంద్రాలకు పంపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐసీ కోర్సులకు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏడాది పరీక్షలతో పాటు పీజీ ఏంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎస్‌డబ్ల్యూ, ఎమ్‌ఎల్‌ఐసీ, ఎంబీఏ ప్రథమ, చివరి ఏడాది పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీవరకు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి అభ్యర్థులకు సంబంధిత స్టడీ సెంటర్‌లలో హాల్‌టికెట్లను అందజేయనున్నట్లు సమాచారం.
25న జోనల్ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : జీఓ 117 రద్దు, ఉపాధ్యాయుల సర్దుబాటు, మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన జోనల్ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం డీఈఓ కార్యాలయానికి రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. ఆ ఉత్తర్వుల మేరకు ఈ నెల 25వ తేదీన తిరుపతి జిల్లా కేంద్రంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జోనల్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment