శివా..ఎవరికి వరమిస్తావో?
ముక్కంటి చెంత.. మూడు ముక్కలాట
● శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు కోసం ముక్కోణపు పోటీ ● అనుచరుడికి చైర్మన్ పదవిని ఖరారు చేయించిన బొజ్జల ● అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యేలు సత్రవాడ, ఎస్సీవీ, జనసేన ● త్రిముఖ పోటీతో చైర్మన్ పేరు ప్రకటించని వైనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి అధ్యక్ష పదవి కోసం టీటీడీ, జనసేన నేతలు నాకా నీకా అంటూ పోటీపడుతున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తన అనుచరుడి పేరు ఖరారు చేయించినా.. మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య, జనసేన నాయకురాలు కోట వినూత అడ్డుకున్నారు. ఫలితంగా బొజ్జల అనుచరుడి పేరుని ప్రకటించకుండా ఆపినట్లు విశ్వసనీయ సమాచారం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీటీడీ పాలకమండలి తరువాత శ్రీకాళహస్తి పాలక మండలి అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా తన ముఖ్య అనుచరుడు చెంచయ్యనాయుడికి ఇప్పించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి భావించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ద్వారా ట్రస్ట్‌బోర్డు చైర్మెన్‌గా చెంచయ్యనాయుడు పేరును ఖరారు చేయించినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజులో అధికారికంగా ప్రకటన వెలువడనుందని తెలిసి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు నేరుగా సీఎం చంద్రబాబుని కలిసి తన ప్రతిపాదనను ఆయన ముందుంచినట్లు తెలిసింది. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారిలో తనతో పాటు మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య ఒకరని వివరించినట్లు సమాచారం. మునిరామయ్య కుమారుడైన సత్రవాడ ప్రవీణ్‌కి ఇప్పిస్తే.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకింగ్ ఉన్న పల్లెరెడ్ల నుంచి పార్టీపట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని వివరించినట్లు తెలిసింది. శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్‌గా ఇప్పటి వరకు పల్లెరెడ్లకు ఇవ్వలేదని, ఈ సారి ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్‌కి ఇస్తే భవిష్యత్‌లో పల్లెరెడ్ల ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు దృష్టి తీసుకెళ్లినట్టు సమాచారం.
జనసేనకు ఎందుకు ఇవ్వరు?
కూటమిలో భాగస్యామ్యమైన జనసేనకు శ్రీకాళహస్తి ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని ఆ పార్టీ నాయకురాలు కోట వినుత డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అదేవిధంగా ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుని ఆమె కలిసి ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవి తనకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎమ్మెల్యే పదవి ఉందని, జనసేనకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టడం న్యాయమైనదని సీఎంకు వివరించినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవి ఎమ్మెల్యే బొజ్జల అనుచరుడికి ఇస్తే.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, జనసేన వర్గం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు.. సుధీర్‌రెడ్డి సూచించిన పేరున ప్రకటించకుండా ఆపినట్లు శ్రీకాళహస్తిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వకపోతే.. నియోజకవర్గంలో బొజ్జల సుధీర్‌రెడ్డికి విలువ లేకుండా పోతుందని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో శ్రీకాళహస్తీశ్వరుడు ఎవరికి వరమిస్తాడో అని నియోజకవర్గ జనం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment