● ప్రభుత్వ తీరుపై మండిపడ్డ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజమనడానికి ఈ సంవత్సరం ‘అమ్మకు వందనం’ ఇవ్వకుండా పంగనామం పెట్టడమేనని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో రూ.15 వేలే ఇచ్చిందని, తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా అమ్మకు వందనం పేరుతో రూ.20 వేలు ఇస్తామని గొప్పలు చెబుతూ హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే గత నాలుగు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో వచ్చే ఏడాది నుంచి అమ్మకు వందనం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా పేద ప్రజలకు సకాలంలో అందించిన గొప్ప నాయకుడు జగనన్న మాత్రమేన అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు నేడు ’ పథకం ద్వారా సుమారు రూ.60వేల కోట్లతో ప్రయివేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, పుస్తకాలు, దుస్తులు, షూ ఇస్తూనే మాతృభాషకు ఎక్కడా విఘాతం కల్గించకుండా మాతృభాషతో పాటు ఆంగ్ల విద్యను కూడా ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. అయితే గత ఏడు నెలల్లో ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించలేదు కానీ రాష్ట్రమంతా మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు.
‘అమ్మకు వందనం’ బాబు పంగనామం
Comments
Please login to add a commentAdd a comment