పొంచి ఉన్న నీటి గండం!
● స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్ ● ఎడారిగా మారనున్న వేల ఎకరాల పంట భూములు ● సాగునీటి పథకాలకూ ఇబ్బందే ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● లబోదిబో మంటున్న అన్నదాతలు ● వైఎస్సార్‌సీపీ పాలనలో ఇసుక రీచ్‌లు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
పెళ్లకూరు: చుట్టూ పచ్చని పంట పొలాలు. పోరు గాలికి ఆటూ ఇటూ తలూపుతూ రైతును ఉల్లాస పరిచే వరి పైర్లు. నోరూరించే కూరగాయల తోటలు. సాగుకు అనుకూలంగా వేలాది ఎకరాలు.. కానీ ఇవేవీ కూటమి ప్రభుత్వానికి కనిపించడంలేదు. స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్ ఏర్పాటుకు అనుమతిలిస్తూ ఆదేశాలివ్వడం విమర్శలకు తావిస్తోంది. నదీ పరివాహక భూములన్నీ ఎడారిని తలపిస్తాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
నాటి నుంచీ!
1987లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు తెలుగుగంగా కాలువ ఏర్పాటు చేసి స్వర్ణముఖి నదికి గంగ జలాలను విడుదల చేయించారు. దాంతో మండలంలోని ముమ్మారెడ్డిగుంట, పుల్లూరు, కలవకూరు, చింతపూడి, అనకవోలు, పెరుమాళ్లపల్లి, యాలకారికండ్రిగ, గంగరాజుకండ్రిగ, భీమవరం, రావులపాడు, కొత్తూరు, పెళ్లకూరు, కప్పగుంటకండ్రిగ, చిల్లకూరు, జీలపాటూరు, చావలి, చెంబడిపాళెం, పాలచ్చూరు, తాళ్వాయిపాడు గ్రామాల్లోని సుమారు 1,150 మందికి పైగా రైతులు 6,352 ఎకరాల్లో వరి, వేరుశనగ, పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. అలాగే స్వర్ణముఖినది నుంచి చెంబడిపాళెం గ్రామం వద్ద రాజీవ్ టెక్నాలజీ మంచినీటి పథకం ద్వారా దిగువచావలి, చెంబడిపాళె, బంగారంపేట, ఊడిపూడి, మోదుగులపాళెం, రోసనూరు, రాజుపాళెం, సిద్దాపురం వేణుంబాక గ్రామాలకు తాగునీరు సరపరా అవుతోంది. అలాగే తాళ్వాయిపాడు, ఎగువచావలి, శిరసనంబేడు, చిల్లకూరు, జీలపాటూరు, పెళ్లకూరు, కొత్తూరు, రావులపాడు, నెలబల్లి, చింతపూడి, పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు, అనకవోలు గ్రామాల్లోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లకు స్వర్ణముఖినది నుంచి తాగునీరు అందుతోంది.
పొంచి ఉన్న ముప్పు
స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ మంజూరు చేయడం వల్ల పచ్చని పంట పొలాలకు ముప్పు పొంచి ఉంది. ఇసుక తోడేస్తే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. నదికిరువైపులా సారవంతమైన భూములు ఉండడంతో 1967లో అప్పటి పాలకులు కలవకూరు వద్ద స్వర్ణముఖినదిపై చెక్‌డ్యామ్ నిర్మించారు. పాలచ్చూరు సప్లయ్ చానల్‌కు సాగునీరు సరపరా చేస్తున్నారు. తద్వారా పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాల్లోని సుమారు 37 చెరువులకు సాగునీరు అందుతోంది. ఈ క్రమంలో ఈ ప్రాంత రైతులు వంగ, బెండ, కాకర, చిక్కుడు, బీర తదితర కూరగాయలతో పాటు అనేక రకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు.
వరి పైర్లు ధ్వంసం
కలవకూరు వద్ద ఇసుక రీచ్ కోసం ఇటీవల సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి స్వర్ణముఖి నదిని పరిశీలించారు. ఆమె ఆదేశాల మేరకు నదీ తీరంలోని ప్రభుత్వ భూముల్లో పేదలు సాగు చేసుకుంటున్న వరి పైర్లను యంత్రాలతో ధ్వంసం చేసి ఇసుక రీచ్‌కు రహదారి ఏర్పాటు చేశారు.
ఇసుకరీచ్ రద్దు చేయాలి
స్వర్ణముఖినదిలో మంజూరు చేసిన ఇసుక రీచ్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కూటమి నేతలు ట్రాక్టర్లతో ఇసుక తోడేయడం వల్ల వ్యవసాయ బోర్ల వద్ద భారీ గోతులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు అందడం లేదు.
చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, పుల్లూరు
కలెక్టర చర్యలు తీసుకోవాలి
వేల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీటికి కేంద్ర బిందువుగా ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసురీచ్ విషయమై కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించి రద్దు చేయాలి. గత ప్రభుత్వంలో విడుదలైన కోర్టు ఉత్తర్వులను కొనసాగించేలా చర్యలు చేపట్టాలి.
– వెంకటేశ్వర్లు, చెంబేడు
నీటి గండం తప్పదు
స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ మంజూరు చేయడం వల్ల సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయి. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే రైతులకు సాగురు ప్రశ్నార్థకమవుతుంది.
– కుమారస్వామి,
పునబాక
●
గత ప్రభుత్వంలో ఇసుకరీచ్‌లు రద్దు
2019–24లో జగన్ ప్రభుత్వం కలవకూరు, కప్పగుంటకండ్రిగ, తాళ్వాయిపాడు గ్రామాల్లో మంజూరు చేసిన ఇసుక రీచ్‌లను అప్పటి అధికార పార్టీ నేతలే ఇక్కడి పరిస్థితులను హైకోర్టుకు విన్నవించారు. దాంతో రైతులు, ప్రజల సౌకర్యార్థం కోసం ఆ ఇసుక రీచ్‌లను అప్పటి జగన్ ప్రభుత్వం రద్దు చేశారు. కానీ ప్రస్తుత కూటమి నేతలు పోలీసుల కనుసన్నల్లో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. రైతులు, ప్రజల సంక్షేమం పట్టని నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment