తిరుపతి అర్బన్: తిరుపతి నగరపాలక డెప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో 250 మంది అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
డెప్యూటీ మేయర్ ఎన్నిక నేడు
తిరుపతి నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం నిర్వహించడానికి కోరం లేకపోవడంతోనే మంగళవారానికి వాయిదా వేశామని జేసీ, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 47 మంది కార్పొరేటర్లు ఉన్నారని, అంతేకాకుండా ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారని చెప్పారు. మొత్తం 50 మందిలో కోరం ప్రకారం 25 మంది హాజరుకావాల్సి ఉందని వెల్లడించారు. అయితే సోమవారం 22 మంది హాజరుకావడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.
ఎస్వీయూ అష్ట దిగ్బంధం
తిరుపతి సిటీ: ఎస్వీయూను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వేల సంఖ్యలో పోలీసులు వర్సిటీలో ఉదయం 6 నుంచే హల్‌చల్ చేశారు. వర్సిటీ పరిపాలనా భవనానికి వెళ్లే అన్ని దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్సిటీకీ అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. వర్సిటీ ఆవరణలోని మెన్, ఉమెన్ హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మెస్‌లకు వెళ్లేందుకు, వర్సిటీ నుంచి నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డుకున్నారు. బయటకు వెళ్లిన విద్యార్థులను వర్సిటీలోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే పడిగాపులు కాశారు.
Comments
Please login to add a commentAdd a comment