బాద్‌షా
ఆదివారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
పాలనలో..
రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన జిల్లా
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొడంగల్: పట్టణంలోని కార్గిల్ కాలనీలో 33 కేవీ విద్యుత్ లైన్ మార్పు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11నుంచి సాయంత్రం 4 గంటల వరకు(5గంటల పాటు) సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కొడంగల్, పెద్దనందిగామ, రావులపల్లితో పాటు టెకుల్‌కోడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో కూడా సరాఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు విషయాన్ని గమనించాలని కోరారు.
ధారూరు మార్కెట్‌కు 1,223 సంచుల వడ్లు రాక
ధారూరు: ధారూరు వ్యవసాయ మార్కెట్‌కు శనివారం సోనా రకం వడ్లు 1,223 సంచులు వచ్చాయని మార్కెట్ కమిటీ సిద్ధమ్మ తెలిపారు. క్వింటాలుకు తక్కువగా రూ.2,400, మధ్యస్తంగా రూ.2,500, అత్యధికంగా రూ.2,630 వరకు అమ్మకాలు జరిగాయని తెలిపారు. కందులు 380 సంచులు వచ్చాయని, తక్కువగా క్వింటాలుకు రూ.8,050, మధ్యస్తంగా రూ.8,150, అత్యధికంగా రూ.8,210 వరకు ధర పలికిందని పేర్కొన్నారు. అలాగే వరిలో 1010 రకం వడ్లు 165 సంచులు వచ్చాయని తెలిపారు. క్వింటాలుకు తక్కువగా రూ.2,200, మధ్యస్తంగా రూ.2,260, అత్యధికంగా రూ.2,280 వరకు అమ్మకాలు జరిగాయని ఆమె తెలిపారు.
‘రేషన్’ అందరికీ అందాలి
కొడంగల్: ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందేలా చూడాలని తహసీల్దార్ విజయ్ కుమార్ సూచించారు. శనివారం మండలంలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరుకుల పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తూకాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండలంలోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
కేజీబీవీలో డీఈఓ తనిఖీలు
మాడ్గుల: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను శనివారం జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రిజిస్టర్లు, వంటగది, ఆహార పదార్థాలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డీఈఓ వెంట ఏంఈఓ సర్దార్ నాయక్, ఉపాధ్యాయులు ఉన్నారు.
రెండు ప్రధాన పదవుల్లో మన నేతలే..
● కొందరికి చేదు.. మరికొందరికి తీపి జ్ఞాపకాలు మిగిల్చిన 2024 ●
● సీఎం రేవంత్ చొరవతో జిల్లాలో బలపడిన కాంగ్రెస్
● ఎంపీ స్థానంలో కొండా గెలుపుతో పుంజుకుంటున్న బీజేపీ
● అన్ని స్థానాల్లో ఓడినా తగ్గేదేలేదంటున్న బీఆర్‌ఎస్
● పొలిటికల్ రౌండప్
జిల్లా నేతలకు కీలక పదవులు
ఈ ఏడాది జిల్లాని కాంగ్రెస్ నేతలకు కలిసొచ్చిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పదవులు వరించాయి. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముందుగా ఊహించినట్టుగానే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్‌కుమార్‌ను సభాపతి పదవి వరించింది. ఇక జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత పట్నం మహేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కారు పార్టీ దిగి హస్తం గూటికి చేరారు. దీంతో ఆయనకు మండలి చీఫ్‌విప్ పదవి వరించింది. మరో నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఎన్నికలకు ముందు గులాబీ పార్టీని వీడికి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ పదవి దక్కింది.
వికారాబాద్: జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్ఠించడంతో జిల్లాలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గతంలో జిల్లా వాసి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయగా.. సీఎం రేవంత్ రూపంలో ఆ పదవి రెండో సారి జిల్లాను వరించింది. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. ఆ హోదాలో జిల్లాలో ప్రచారం చేశారు.. పార్టీ గెలవడం ఖాయం.. గెలిచాక జిల్లాకు అత్యుత్తమ పదవి దక్కడం ఖాయమని.. తానే సీఎం అవుతానంటూ పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో హస్తం పార్టీ ఒక్కసారిగా పుంజుకొని విజయ దుందుబి మోగించింది. సీఎం పదవి జిల్లానే వరిస్తుందని భావించిన ప్రజలు నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ను ఆదరించి పట్టం కట్టారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ తుడిచి పెట్టుకుపోయింది. జిల్లాకు మొదటి సారి కీలక పదవులు వరించాయి. చేవెళ్ల ఎంపీగా కమలం పార్టీ జయకేతనం ఎగురవేయడంతో జిల్లాలో ఆ పార్టీ క్రమంగా బలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేదుఅనుభవాన్ని మూటగట్టుకున్నా బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు కనిపించడంలేదు. నేతల మధ్య విభేదాలు తగ్గడంలేదు..
న్యూస్‌రీల్
బీఆర్‌ఎస్‌కుచేదు అనుభవం
జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ నేతలను కీలక పదవులు వరించగా.. బీఆర్‌ఎస్ నేతలకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదనే చెప్పవచ్చు. జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరగా చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరకు ఆమెను రేవంత్‌రెడ్డి సిట్టింగ్ సీటు అయిన మల్కాజ్‌గిరి సీటు ఇచ్చి పోటీ చేయించగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. పరిగి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన డీసీసీ అధ్యక్షుడు టీ.రామ్మోహన్‌రెడ్డి పోర్టుపోలియో ఆశించారు. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించినా జిల్లాకు చెందిన వ్యక్తులే సీఎంగా, స్పీకర్‌గా ఉండటంతో అమాత్య పదవి దక్కలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి అధికార పార్టీ తరఫున పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎంపీగా ఉంటూ జిల్లా మీద పట్టు సాధించిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోలేక చితికిల పడగా ఎంపీగా తాను కూడా ఓటమిపాలవడంతో ఇప్పుడు జిల్లాకు చుట్టపుచూపుగా కూడా రావడంలేదు.
సంప్రదాయానికి విరుద్ధంగా..
స్పీకర్ వ్యవహారం సంప్రదాయానికి విరుద్ధంగా తయారైందని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శింస్తున్నారు. రాజ్యాంగ బద్ధమైన, గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన పార్టీ సమావేశాలు, కార్యకలాపాల్లోనూ పాల్గొనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు సీఎం సోదరుడి వ్యవహారం కూడా విమర్శలకు తావిస్తోంది. ఆయనకు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలకడం వంటివి ప్రొటోకాల్ వివాదాలకు తావిస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హస్తం గూటికి చేరారు. ఆయన చేరిక అధికార పార్టీలోకి వచ్చింది మొదలు అటూ భీంభరత్ వర్గానికి కాలె యాదయ్యతో పాటు అధికార పార్టీలో చేరిన నేతలకు పొసగటంలేదు. మరోవైపు స్పీకర్ ప్రసాద్‌కుమార్ సొంత నియోజకవర్గంలోనూ యాదయ్య తలదూరుసుస్తున్నాడని స్పీకర్ వర్గం ఆరోపిస్తోంది. ఇక మరో నేత తాండూరు ఎమ్మెల్యే సైతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తాండూరుతో పాటు పరిగి రాజకీయాల్లోనూ తలదూరుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన తాండూరు ఎమ్మెల్యేగా ఉంటూనే సొంత నియోజకవర్గం పరిగిలోనూ సొంత వర్గాన్ని పెంచి పోశిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ వర్గీయులు పేర్కొంటున్నారు. ఇక మరో ముఖ్యనేత పట్నం మహేందర్‌రెడ్డి ప్రభుత్వ చీప్ విప్‌గా మంచి హోదాలో ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గంగా బావించే తాండూరులో తన పట్టు కోల్పోతున్నారనే భావన ఆయన క్యాడర్ వ్యక్తం చేస్తుంది.
బలపడుతున్న బీజేపీ..
ఎంపీ స్థానం గెలుచుకోవటం బీజేపీకి బలాన్నిచ్చింది. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. దీంతో అడపా దడపా కార్యకలాపాలు నిర్వహిస్తూ.. అవకాశం వచ్చిన ప్రతి చోటా ప్రజల తరఫున గళం వినిపిస్తున్నారు. వామపక్షాలు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారితో జగకట్టడం.. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌తో కొనసాగుతుండటంతో ప్రజలు నమ్మడం లేదనే చెప్పవచ్చు.
బీఆర్‌ఎస్‌లో తగ్గని గిల్లికజ్జాలు
బీఆర్‌ఎస్‌లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లా అధ్యక్షుడు సహా నలుగురు ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. అయినా ఆ పార్టీలో గిల్లి కజ్జాలు తగ్గటంలేదు. పార్టీ సమావేశం జరిగిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పరిపాటిగా మారింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అధికారులపై హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లటం జిల్లా రాజకీయాల్లో మరింత వేడి పుట్టించింది.. బీఆర్‌ఎస్ సమావేశాల్లో ఆయన పేరు తీయకపోవడం పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment