లగచర్ల ఘటన దురదృష్టకరం
వికారాబాద్: ‘లగచర్ల ఘటన దురదృష్టకరం.. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ చూడలేదు.. జరగలేదు.. ఇకమీద కూడా చూడకూడదు’.. అని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం ఆయన అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్‌తో కలిసి తన చాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా చేశారు. మీడియాతో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే.. లగచర్ల లాంటి ఘటన గతంలో ఎక్కడా జరగలేదు. అది రైతులు చేసింది కాదు.. కొన్ని శక్తులు ప్రేరేపిస్తే రైతుల ముసుగులో కొందరు కావాలనే చేశారు.. నేనై నేనుగా వాళ్ల దగ్గరికి వెళ్లలేదు.. రైతుల ముసుగులో వచ్చి గ్రామంలోకి రావాలని బతిమాలితేనే వెళ్లాను.. మన ప్రజల్ని మనం నమ్మకపోతే ఎలా..? నమ్మాలి కదా..? అక్కడికి వెళ్లాక నేను ఏమీ మాట్లాడకుండానే దాడి ప్రారంభించారు.. నేను మాట్లాడాక నా మాటలు వారికి ఆమోదయోగ్యం లేకుంటే వాదించాలి. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే దాడి చేశారు.. భూ సేకరణ అనేది ఇదే మొదటి కాదు.. ఇదే చివరిది కూడా కాదు.. ఇది అభివృద్ధిలో భాగం కదా..? అన్నారు.
వసతి గృహాలపై ప్రత్యేక దృష్టికల్పనకు కృషి చేస్తున్నాం
జిల్లాలో వివిధ రకాల 96 వసతి గృహాలు ఉన్నాయి.. వీటిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.. బేసిక్ అవసరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం రూ.96 లక్షలు ఖర్చు చేశాం. ప్రధానంగా తలుపులు, కిటికీలు సక్రమంగా ఉండేలా చూడటం.. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాం.. అన్ని వసతి గృహాల్లో తాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నాం.. ఎక్కువ వెళుతురు ఇచ్చే లైట్లు ఏర్పాటు చేశాం. అవసరమైన చోట ఫ్యాన్లు ఏర్పాటు చేయించాం. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. మీడియా కూడా సంయమనం పాటించాలి.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థుల ఫొటోలు ప్రచురించకుండా చూడాలన్నారు.
విద్య, వైద్యంపై ఫోకస్
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఒక్కో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ 20 పాఠశాలలను పర్యవేక్షించాల్సి వచ్చేది. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు.. మళ్లీ వారి పనులు కూడా చేసుకోలేరు.. అందుకే ఐదు నుంచి ఆరు స్కూళ్ల బాధ్యతలు అప్పగించాం. బోధనపై దృష్టి సారించడంతో పాటు విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. వైద్య సేవల్లో రాజీ పడం. నవాబుపేట పీహెచ్‌సీని మోడల్ పీహెచ్‌సీగా అభివృద్ధి చేస్తున్నాం.. మిగిలిన వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌లో పెద్దాస్పత్రులు ఉన్నాయి. వాటిని ప్రజలు వినియోగించుకోవాలి. ధరణి పెండింగ్ దరఖాస్తులను 15వేల నుంచి 6వేలకు తగ్గించాం.. నా లాగిన్‌లో అయితే కేవలం 300 మాత్రమే పెండింగ్ ఫైళ్లు ఉన్నాయి. గతంలో అన్ని ఫైళ్లు నా లాగిన్‌కే వచ్చేవి.. ఇప్పుడు తహసీలార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్ ఎవరి స్థాయిలో వారు ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.
అది కొందరు కావాలని చేసిందే..
వసతి గృహాల్లో వసతుల కల్పనకు కృషి
నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు
అట్టడుగు వర్గాలకు వైద్యం అందేలా చూస్తాం
మీడియా చిట్‌చాట్‌లో కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment