గుడ్డు.. గోవిందా !
బషీరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు దాదాపు 45 రోజులుగా కోడిగుడ్లు సరఫరా కావడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వడం లేదు. జిల్లాలోని అన్ని సెంటర్లకు ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో గుడ్లను సరఫరా చేస్తారు. ప్రతి నెలా రెండు పర్యాయాలు (మొదటి.. మూడో వారంలో) పంపిణీ చేస్తుంటారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెల వరకు అంగన్‌వాడీలు ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో ఇండెంట్ అప్‌లోడ్ చేశారు. కానీ కేంద్రాలకు గుడ్లు సరఫరా కాలేదు. ఈ విషయమై అంగన్‌వాడీ టీచర్లు, క్షేత్రస్థాయి అధికారులను వివరణ కోరగా.. పై నుంచి సరఫరా కాలేదు.. మేమేం చేసేది అని బదులిచ్చారు. కేంద్రాల్లోని ప్రీ స్కూల్ పిల్లలకు నెలన్నరగా గుడ్డు లేకుండా భోజనం పెడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
జిల్లాలో 1,107 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ప్రతి నెలా 5 నుంచి 8 లక్షల వరకు గుడ్లను సరఫరా చేస్తారు. 45 రోజులుగా సరఫరా కాకపోవడంపై ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా అయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా శిశుసంక్షేమ అధికారిపై ఉంటుంది. అయితే కార్యాలయంలో పని చేసే ఓ చిరుద్యోగి ఈ వ్యవహారం చూడటం వల్లే సరఫరా కాలేదని తెలిసింది. అలాగే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు టీహెచ్‌ఆర్ (టేక్ హోం రేషన్) కింద ప్రతి నెలా 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందకుండా పోయాయి.
‘ఆరోగ్యలక్ష్మి’దీ ఇదే పరిస్థితి
గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు గుడ్డు, 200 ఎంఎల్ పాలు, అన్నం, కూరగాయలతో భోజనం వండి పెడతారు. వీరికి కూడా రెండు నెలల నుంచి గుడ్డులేని ఆహారం ఇస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు 45 రోజులుగా సరఫరా నిలిపివేత
ఇండెంట్ పెట్టినాపంపిణీ చేయని కాంట్రాక్టర్
పట్టించుకోని అధికార యంత్రాంగం
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం
బిల్లులు చెల్లించం
ఎక్కడో పొరపాటు జరగడం వలన అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా నిలిచిపోయింది. ప్రతి నెలా సక్రమంగా సరఫరా చేయాలని పౌల్ట్రీఫాం కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం. ఒకసారి చిన్న సైజు గుడ్లు తెస్తే వెనక్కు పంపారు. అన్ని సెంటర్ల నుంచి సకాలంలో ఇండెంట్ అందినా సరఫరా కాలేదు. అంగన్‌వాడీ టీచర్లు బయోమెట్రిక్ ద్వారానే గుడ్లను డ్రా చేస్తారు. ఇందులో అక్రమాలకు చోటులేదు. నెలన్నరగా గుడ్లు సరఫరా కాలేదు.. కాబట్టి వాటి బిల్లులు కూడా చెల్లించలేదు. చలికాలంలో పౌల్ట్రీలో గుడ్ల ఉత్పత్తి తగ్గడం వలన సరఫరా కాలేదని కాంట్రాక్టర్ చెప్పారు. ఇకనుంచి సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాం. గడిచిన రోజులకు గుడ్లు ఇవ్వడం కుదరదు.
– కృష్ణకుమారి, డీడబ్ల్యూఓ
Comments
Please login to add a commentAdd a comment