అర్హులందరికీ సంక్షేమం
● లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి ● ఈ నెల 16 నుంచి 20 వరకుక్షేత్రస్థాయి పరిశీలన ● 21 నుంచి 24 వరకు అర్హుల ముసాయిదా ● 25 లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు అమలు చేసేందుకు సంకల్పించిందన్నారు. ఈ నాలుగు పథకాల అమలుకు సంబంధించిన విధి విధానాలు, క్షేత్ర స్థాయి పరిశీలన, గ్రామ, వార్డు సభల నిర్వాహణ, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలను అధికారులకు వివరించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, గ్రామ సభలు, వార్డు సభల నిర్వాహణకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 20వరకు క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేయాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం చేస్తూ 21 నుంచి 24వరకు నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో అర్హుల ముసాయిదా చదివి వినిపించాలన్నారు. అభ్యంతరాలుంటే స్వీకరించి పది రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. 25లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు పథకాల అమలుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ఐఏబీఎస్‌కు షరతులు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(ఐఏబీఎస్) పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా (ఒక్కో విడత రూ.6వేల చొప్పున) సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పథకానికి అర్హులుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలై ఉండి ఉపాధి హామీ పథకం కింద 2023–2024లో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలన్నారు.
కుల గణన సర్వే ఆధారంగా రేషన్‌కార్డు
కుల గణన సర్వే ఆధారంగా తయారుచేసిన రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా క్షేత్రస్థాయి పరిశీలనకు మండల స్థాయిలో ఎంపీడీఓలు పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు ప్రక్రియకు బాధ్యులని, ఆ తర్వాత జిల్లాస్థాయిలో కలెక్టర్ (రెవెన్యూ అదనపు కలెక్టర్), జిల్లా సివిల్ సప్లై అధికారి పర్యవేక్షకులుగా ఉంటారని చెప్పారు. ముసాయిదా జాబితాను గ్రామసభ/ వార్డు సభలో ప్రదర్శించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారని, ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను మండల /మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ కు పంపించాల్సి ఉంటుందన్నారు. ఆ జాబితాను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి చెందితే సీసీఎస్ లాగిన్‌కు పంపుతారని, ఫైనల్ లిస్ట్ ప్రకారం సీసీఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని ఆయన తెలిపారు.
స్థలం ఉన్నవారికి తొలిప్రాధాన్యత
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉండి స్థలం ఉన్నవారు, అద్దె నివాసంలో ఉండేవారు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని చెప్పారు. ఆర్‌సీసీ, ఇటుక గోడలు లేకుండా రేకుల షెడ్డు,గుడిసెలు ఉన్నవారికి, యువ వితంతువులు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులై ఉండి సొంత స్థలాలు లేని వాళ్లకు సైతం ఇళ్లు కేటాయించబడతాయన్నారు.
లబ్ధిదారుల వివరాలు సేకరించండి
క్షేత్రస్థాయి పరిశీలనకు షెడ్యూల్ తయారు చేసుకోవాలని.. నిర్వహించే ముందే గ్రామాల్లో టాంటాం వేయించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పంచాయతీల వారీగా ఎంతమందికి రుణమాఫీ, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల అమలయ్యోయో వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వసతిగృహాల్లో, పాఠశాలల్లో మెనూతో పాటు నాణ్యమైన భోజనం అందిచాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్పాహారంలో సమస్యలుంటే చెప్పాలని కోరారు. విద్యార్థులతో స్వాగత కార్యక్రమాలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సుధీర్, ట్రెయినీ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్‌డీఏ శ్రీనివాస్, డీఈఓ రేణుక దేవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డీబీటీ పద్ధతిలో ‘రైతుభరోసా’
రైతు భరోసా సాయం ఎకరాకు రూ.12వేలకు పెంచారని.. ఇది రెండు విడతలుగా రూ.6వేల చొప్పున డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నగదు జమవుతుందని చెప్పారు. సా గు యోగ్యంగా లేని భూములను పథకం నుంచి తొలగించాలని సూచించారు. ఇళ్లు, కాలనీలుగా మారిన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్స్, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాంలకు, మైనింగ్‌కు వినియోగిస్తున్న భూములు, ప్రభుత్వం సేకరించిన భూ ముల ను, రాళ్లు, గుట్టలతో సాగుకు అనువువుగాలేని భూములను వ్యవసాయ యోగ్యం కాని భూ ములుగా గుర్తించాలన్నారు. ఇందుకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, డీటీసీపీ లేఅవుట్లు, పెండింగ్ లేఅవుట్‌లను పరిశీలించాలని చెప్పారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల వ్యసాయ విస్తరణ అధికారి బృందం సాగు యోగ్యం కాని భూములను గుర్తిస్తుందని వివరించారు.
ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్
అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీడీఓలు, తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్క్యులర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి ప్రొసీడింగ్స్ అందజేయాలని ఆదేశించారు. ఈ నెల 26న ప్రారంభించనున్న నాలుగు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంపీడీఓలు, తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని గురువారం వరకు లిస్ట్ తయారు చేయాలన్నారు. పూర్తి చేసిన లిస్ట్‌ను సూపర్ చెకింగ్ పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సభలకు బృందాలను ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. రుణ మాఫీ, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలపై గ్రామాలు, వార్డుల వారీగా లిస్ట్ తయారు చేయాలన్నారు. తహసీల్దార్లు కమిటీలు ఏర్పాటు చేసి లిస్ట్ సూపర్ చెకింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment