మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
అబ్దుల్లాపూర్‌మెట్: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నగరానికి ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. పెద్దఅంబర్‌పేటలో శుక్రవారం పురపాలక సంఘం చైర్‌పర్సన్ పండుగుల జయశ్రీరాజు అధ్యక్షతన జరిగిన పురపాలక సంఘం పాలకవర్గం సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల అఽభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి రూ.114కోట్లు మంజూరు చేయించానన్నారు. సమీప ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లోంచి వచ్చే మురుగునీరు పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని పసుమాముల చెరువులో కలపడంతో స్థానికులు ఇబ్బందులు పడుతుండడంతో.. ఆ మురుగును మూసీ కాలువలో కలిపే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేయకుండా ఉండాలని సీఎంని కోరగా.. కమిటీ వేసినట్లు తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు.
పలు అంశాల తీర్మానం
కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ప్రతి వార్డు అభివృద్ధికి రూ.50లక్షల చొప్పున కేటాయించాలని తీర్మానించారు. తట్టి అన్నారంలోని 16 కాలనీల మురుగు నీటిని తరలించేందుకు ట్రంక్ లైన్ నిర్మాణం కోసం రూ.10కోట్లు, పెద్దఅంబర్‌పేట–పసుమాముల వరకు మంజూరైన ట్రంక్ నిర్మాణం 2 కిలోమీటర్ల పొడిగింపు కోసం మరో రూ.6 కోట్లు కేటాయించాలని తీర్మానం చేశారు. వీటితో పాటు ఇటీవల పురపాలక సంఘం పరిధిలో విలీనమైన కుత్బుల్లాపూర్, బాచారం, గౌరెల్లి, తారామతిపేట గ్రామాల అభివృద్ది కోసం ప్రతి గ్రామానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో వైస్ చైర్మన్ చామ సంపూర్ణవిజయశేఖర్‌రెడ్డి, కమిషనర్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment