దూసుకొచ్చిన మృత్యువు
బొంరాస్‌పేట: సంక్రాంతి సెలవులకు సొంతూరికి వచ్చిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబసభ్యుడితో బయటికి వెళ్లిన అతడిపై మృత్యువు డీసీఎం రూపంలో దూసుకొచ్చింది. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని మైసమ్మగడ్డతండా గేటు సమీపంలోని రంగయ్యవాడ్క కల్వర్టు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాజీ ఉప సర్పంచ్ రాములునాయక్ కుమారుడు డేగావత్ వెంకటేశ్(21) జడ్చర్ల గురుకుల కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రాములు నాయక్ తమ్ముడు పూల్యానాయక్ కొడుకై న డేగావత్ సంతోష్ వ్యవసాయం చేస్తున్నాడు. కాగా తన ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి వెళ్లొద్దామని శుక్రవారం తన బైక్‌పై వెంకటేశ్‌ను తీసుకుని పరిగికి బయల్దేరారు. మార్గమధ్యలో పరిగి నుంచి కొడంగల్ వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనకాల ఉన్న వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సంతోష్‌కు తీవ్ర గాయాలవ్వగా పరిగి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని కొడంగల్ మార్చురీకి తరలించామని ఎస్‌ఐ ఎండీ రవూఫ్ తెలిపారు. పండగ సెలవుల్లో ఇంటికి వచ్చిన తన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, తండావాసులు పెట్టిన బోరున విలపించారు.
బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం
డిగ్రీ విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment