అంకితభావంతో పనిచేయాలి
అనంతగిరి: సంక్షేమ పథకాల అమలుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్‌తో కలిసి గ్రామసభలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో కలిసి నాలుగు సంక్షేమ పథకాలపై చర్చించారు. గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం సమయపాలన పాటిస్తూ నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యానికి తావులేకుండా జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్నారు. గ్రామ సభల్లో ఫ్లెక్సీలు, టెంట్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని మెడికల్ టీం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో అర్హుల జాబితా ప్రదర్శించాలని.. గ్రామ సభలో అందే ఫిర్యాదులపై నాలుగు పథకాలకుగాను నాలుగు రిజిస్టర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించాలన్నారు. గ్రామ సభలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రశ్నలకు సామరస్యంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
అభ్యంతరాలుంటే దరఖాస్తులు
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలలో లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని, అభ్యంతరాలుంటే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రజలకు ఎలాంటి అపోహలకు తావు ఉండకుండా స్పష్టంగా వివరించాలన్నారు. ఈ మొత్తం సంక్షేమ పథకాల రోజు వారీ ప్రక్రియను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సభల తీర్మాన ప్రతులను సురక్షితంగా, జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీఎస్‌ఓ మోహన్ బాబు , పీడీ హౌసింగ్ కృష్ణ, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్ అధికారి, జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండలాల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలి
నాలుగు పథకాల ఫిర్యాదుల స్వీకరణకు నాలుగు రిజిస్టర్లు
ప్రజలకు సామరస్యంగా సమాధానం ఇవ్వాలి
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment