శంకర్‌పల్లి.. అభివృద్ధి లోగిలి | - | Sakshi
Sakshi News home page

శంకర్‌పల్లి.. అభివృద్ధి లోగిలి

Published Fri, Jan 24 2025 8:18 AM | Last Updated on Fri, Jan 24 2025 8:18 AM

శంకర్‌పల్లి.. అభివృద్ధి లోగిలి

శంకర్‌పల్లి.. అభివృద్ధి లోగిలి

శంకర్‌పల్లి: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఏర్పడిన తొలి మున్సిపల్‌ అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం అందలమెక్కింది. మండల కేంద్రం నుంచి మున్సిపల్‌గా అప్‌గ్రేడ్‌ అయితే ఎలాంటి అభివృద్ధి ఉంటుందనేది ఈ పురపాలికను చూస్తే అవగతమవుతోంది. గడిచిన ఐదేళ్లలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం గమనర్హం. మున్సిపల్‌ పరిధిలోని కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థతో మున్సిపాలిటీ కళకళలాడుతోంది. రేపటితో (జనవరి 25) మున్సిపల్‌ పాలకవర్గం పదవీకాలం ముగియనుండడంతో ‘సాక్షి’ప్రత్యేక కథనం

ఏడాదిన్నర తర్వాత పాలవర్గం

2018 ఆగస్టులో శంకర్‌పల్లి, బుల్కాపూర్‌, ఫత్తేపూర్‌, రామంతాపూర్‌, సింగాపూర్‌తో పాటు మరో నాలుగు గ్రామాలను కలుపుతూ అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శంకర్‌పల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 21వేల జనాభా ఉండగా.. 15వార్డులుగా విభజించారు. మున్సిపల్‌ ఏర్పడినప్పటికీ ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గం ఏర్పాటుకు మాత్రం ఏడాదిన్నర సమయం పట్టింది. 2020 జనవరి 25న తొలి పాలకవర్గం ఏర్పడగా.. చైర్‌పర్సన్‌గా అప్పటి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాత విజయలక్ష్మిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక నిధులు

నియోజకవర్గంలోని ఏకై క మున్సిపాలిటీ కావడంతో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యేకున్న సాన్నిహిత్యంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేశారు. గతంలో మున్సిపాలిటీకి వచ్చే ప్రధాన రహదారులు, కాలనీల్లోని సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం గందరగోళంగా ఉండగా.. ప్రస్తుతం ఒకదారిలోకి తీసుకోని వచ్చారు. అంతిమయాత్రకు వైకుంఠ రథం, నిత్యం చెత్త సేకరణకు అవసరమైన రెండు ఆటోలను కొనుగోలు చేశారు.

పచ్చని ‘వెలుగులు’

హరితహారం, పట్టణ ప్రకృతి వనం పేరిట మున్సిపాలిటీలో పచ్చదనం పెంపునకు పెద్దపీట వేశారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వారాంతాల్లో పిల్లలు ఆడుకునేందుకు, వృద్ధులు సేదతీరడానికి పట్టణంలోని వివేకానందనగర్‌ కాలనీలో చిల్డ్రన్స్‌ పార్కుతో పాటు, మహిళలు, పిల్లలు వ్యాయామం చేసేందుకు గాను ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేశారు. బుల్కాపూర్‌ శివారు నుంచి శంకర్‌పల్లి పట్టణ చౌరస్తా వరకు నాలుగు వరుసల రహదారిపై డివైడర్‌ని ఏర్పాటు చేసి, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే సారథ్యంలో మున్సిపాలిటీలో ప్రగతి

రూ.వంద కోట్ల నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు

ఆదర్శ పురపాలికగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కృషి

మంజూరైన నిధుల వివరాలు

14, 15 ఆర్థిక సంఘం,

పట్టణ ప్రగతి నిధులు రూ.15.50 కోట్లు

స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.87.50 లక్షలు

ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.30.80 లక్షలు

రాష్ట్ర నిధులు రూ.3 కోట్లు

టీయూఎఫ్‌ఐడీసీ రూ.37.58 కోట్లు

రూర్బన్‌ నిధులు రూ.83 లక్షలు

హెచ్‌ఎండీఏ రూ.ఒక కోటి

ఎంపీ ల్యాడ్స్‌ రూ.55.60 లక్షలు

అమృత్‌ 2.0 రూ.32.47 కోట్లు

అభివృద్ధికి నిరంతరం కృషి

మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేశాం. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో సుమారు రూ.వంద కోట్ల అభివృద్ధి పనులు చేయించుకున్నాం. ఐదేళ్లలో ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశాను.

– సాత విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, శంకర్‌పల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement