అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
దోమ: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం దోమ మండలం కిష్టాపూర్‌లో రూ.1.13కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను విస్మరించి పాలన సాగించిందన్నారు. ఆరు లక్షల రేషన్ కార్డులు తొలగించి పేదలకు బియ్యం, సరుకులు అందకుండా చేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. త్వరలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు అధికారులతో కలిసి భూమిపూజ చేశారు. ఆ తర్వాత పట్టణ పరిధిలోని కేజీబీవీని సందర్శించారు. పాఠశాల పరిసరాలు, వంట గది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. చదువు బాగు చెబుతున్నారా? భోజనం సక్రమంగా.. మెనూ ప్రకారం అందిస్తున్నారా? అని ఆరా తీశారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. పాఠశాల ఆవరణలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రహరీ చిన్నగా ఉందని, ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని ఎస్‌ఓ చైతన్య ఎమ్మెల్యేను కోరారు. త్వరలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్‌బాబు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, డైరెక్టర్ శాంతుకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములునాయక్, మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment