ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులే..!
● 2018లో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువకులు ● ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి
కొడంగల్: నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ కార్పొరేషన్ రుణాల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. రుణాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలకు పిలిచి అర్హులను గుర్తించారు. అప్పట్లో రుణాలు వస్తాయని లబ్ధిదారులు భావించారు. ముందస్తు ఎన్నికలతో ప్రక్రియ ఆగిపోయింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో రుణాల పంపిణీ నిలిచిపోయింది. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. అనంతరం మున్సిపల్ ఎన్నికలు రావడంతో మరోసారి రుణాల పంపిణీ ఆగిపోయింది. గతంలో గ్రామానికి ఒకరిద్దరిని ఎంపిక చేసి రూ.50 వేలు, రూ. లక్షలోపు ఉన్న వారికి కొంతమందికి చెక్కులు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలు పెండింగ్‌లో పడ్డాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలవారి ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు అందించాలని నిర్ణయించింది. 2015–16 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2017–18 ఆర్థిక సంవత్సరం వరకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు ఇవ్వాల్సి ఉంది. బీసీ యువకుల స్వయం ఉపాధికి మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తగిన చొరవ తీసుకొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment