డీల్ కుదిరితే ఓకే.!
● దోచుకోవడమే లక్ష్యంగా స్థాయీ సంఘ సమావేశాలు ● కాంట్రాక్టర్లతో నేరుగా బేరసారాలు? ● సానుకూలంగా ఉంటే జై.. లేకపోతే వాయిదా
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశాలు దోచుకోవడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న చందంగా కాంట్రాక్టర్లతో నేరుగా సభ్యులు బేరాలు మాట్లాడుకుంటున్నారు. డీల్ కుదిరితే సమావేశంలో ఆ అంశానికి జై కొట్టడం.. లేకపోతే వాయిదా వేయడం పరిపాటిగా మారింది. శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం ఏర్పాటు చేయగా గురువారం రాత్రి వరకు ఈ వ్యవహారంపై చర్చోపచర్చలు జరిగినట్లు తెలిసింది.
మూడు నెలలకోసారి నిర్వహించే జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో సుమారు వంద అజెండా అంశాలతో పాటు మరికొన్ని టేబుల్ అజెండా అంశాలు చర్చకు వస్తుంటాయి. అలాంటిది వారానికోసారి నిర్వహించే స్థాయీ సంఘ సమావేశంలో పుంఖాను పుంఖాలుగా అంశాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అంటే ఏ తీరున స్థాయీ సమావేశాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నూతన స్థాయీ సంఘం తొలిసారిగా సెప్టెంబర్ 20న సమావేశమైంది. ఈ సమావేశంలో 280 అంశాలు, అక్టోబర్ 4న నిర్వహించిన సమావేశంలో 124 అంశాలతో పాటు మరో 19 టేబుల్ అజెండా అంశాలు, ఈ నెల 8న నిర్వహించిన స్థాయీ సమావేశంలో 71 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు వచ్చాయి. వీటిలో సభ్యులకు అనుకూలంగా ఉన్న అంశాలన్నీ ఆమోదం పొందాయి. సభ్యులకు తెలియకుండా ఏ అంశం చర్చకు వచ్చినా వాయిదా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం నిర్వహించనున్న సమావేశంలో 117 అంశాలు పొందుపరిచారు. ఇప్పటి వరకు జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో కాంట్రాక్టర్‌తో ఒప్పందాలు పూర్తయిన వాటికి సభ్యులందరూ ఒకే చెప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో అలా.. ఇప్పుడు ఇలా..
గత ప్రభుత్వ హయాంలో స్థాయీ సంఘం సమావేశం నిర్వహించే తేదీకి మూడు, నాలుగు రోజుల ముందుగా సభ్యులకు అజెండాలో పొందుపరిచిన కాపీని పంపేవారు. సభ్యులు ఆ అంశాలపై పరిశీలన చేసి, సమావేశంలో చర్చించి ఆమోదించేవారు. ఆ పరిస్థితి ఇప్పటి స్థాయీ సమావేశాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం సమావేశం నిర్వహించాలని సభ్యులు తీర్మానించారు. అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు వాయిదా పడతున్నాయి. శుక్రవారం సమావేశమైతే గురువారం పొద్దుపోయే వరకు ఏ అంశం అజెండాలో ఉండాలో.. వద్దో ఇటు అధికారులు, అటు స్థాయీ సభ్యులు తేల్చుకోలేకపోతున్నా రు. స్థాయీ సభ్యులు, కాంట్రాక్టర్ల మధ్య బేరాలు కుదిరితే ఆ అంశాన్ని అజెండాలో పొందుపరిచి.. నామమాత్రంగా చర్చించి ఓకే చేస్తున్నారు. సభ్యులకు తెలియకుండా ఏదైనా అంశం ఆమోదం కోసం సమావేశానికి వస్తే నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారు.
నేడు స్థాయీ సంఘ సమావేశం
మేయర్, స్థాయీ సంఘ చైర్‌పర్సన్ హరివెంకటకుమారి అధ్యక్షతన శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం జరగనుంది. ఎజెండాలో మొత్తం 117 అంశాలను పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment