డబ్బులు చెల్లిస్తేనే.. భోజనం!
● ఏయూ హాస్టళ్లలో వింత పోకడలు ● స్కాలర్‌షిప్‌లు మంజూరుకాక ఇబ్బందులు ● విద్యార్థులపైనే మెస్, విద్యుత్ బిల్లుల బారం ● అధికారుల తీరుపై విద్యార్థుల నిరసన గళం ● వైస్ చాన్సలర్ భవనం ముందు ధర్నా
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువులు ఫ్రీ అనుకుని చేరితే, ఇక్కడ డబ్బులు కడితేనే కానీ హాస్టళ్లలో భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారులకు తమ గోడువెళ్లబోసుకున్నా.. పరిష్కారం దొరక్కపోవటంతో నిరసనకు దిగారు. ఆర్ట్స్ అండ్ సైన్సు కోర్సులు అభ్యసించే హాస్టళ్ల విద్యార్థులు సోమవారం వర్సిటీలోని వైస్ చాన్సలర్(వీసీ) భవనం ముందు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులంతా వీసీ భవనం ముందు బైఠాయించటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన విరమించాలని సూచించినా, వర్సిటీ అధికారులు వచ్చి, స్పష్టమైన హామీ ఇచ్చాకే, అక్కడి నుంచి లేస్తామని తెగేసి చెప్పారు. విద్యార్థుల ఆందోళనతో వర్సిటీ అధికారులు దిగివచ్చారు. రిజిస్ట్రార్ ధనుంజయరావు ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భారత్ విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) ఆంధ్ర యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి డి.వెంకటరమణ, సహాయ కార్యదర్శి జి.అజయ్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు. స్కాలర్‌షిప్‌లు రాకపోవటంతో హాస్టల్ నిర్వహణ వ్యయం విద్యార్థులపై వేయటం సరికాదన్నారు. ప్రైవేట్ హాస్టల్ మాదిరి డబ్బులు కడితేనే భోజనం పెడతామని చెబుతున్నారని, దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మెస్ చార్జీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని ఆక్షేపించారు. హాస్టల్‌లో మౌలిక సౌకర్యాలు పెంపొందించకున్నా, విద్యార్థుల నుంచి అభివృద్ధి ఫండ్(హెచ్‌డీఎఫ్) పేరుతో రూ.750లు వసూలు చేస్తున్నారని, కరెంట్ చార్జీలు కూడా విద్యార్థులపైనే వేస్తున్నారని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లతో వర్సిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ ఆర్థిక భారాన్ని మోయలేకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించి, కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ ధనుంజయరావు హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment