‘ప్రత్యేక’ ప్రక్షాళన షురూ..!
● స్పెషల్ బ్రాంచ్‌ను కుదిపేస్తున్న బెట్టింగ్ కేసు ● సీపీ సీరియస్.. రహస్య విచారణ ● ఇటీవలే ఎస్‌బీ నుంచి పలువురికి ఉద్వాసన ● తాజాగా 11 మంది ఆయా స్థానాల్లో పోస్టింగ్‌లు
రహస్య విచారణ?
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాత్రపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి రహస్యంగా విచారణ చేయిస్తున్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఒక అధికారితో పాటు కొందరు సిబ్బంది కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొందరు సిబ్బంది కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు సైతం అందించారన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగానే వారిని ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు, కీలక సమీక్షలకు దూరం పెడుతున్నారన్నట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన టెలీ కాన్ఫెరెన్స్‌కు ఒక అధికారిని దూరం పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ.. పోలీసులు ఛేదించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో ఆ శాఖకు చెందిన పలువురి పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు ఆ శాఖాధికారులకు తలనొప్పిగా మారింది.
విశాఖ సిటీ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ‘స్పెషల్ బ్రాంచ్’ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఎస్‌బీ సిబ్బంది పాత్ర.. పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సీరియస్‌గా ఉన్నారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. స్పెషల్ బ్రాంచ్ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎస్‌బీలో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆ విభాగం నుంచి ఉద్వాసన పలికారు. తాజాగా ఆయా స్థానాల్లో ఇతర స్టేషన్లలో పనిచేస్తున్న ఒక ఏఎస్‌ఐ, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. త్వరలోనే ఇతర అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తవ్వుతున్నకొద్దీ..
క్రికెట్ బెట్టింగ్ కేసును సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో ఒక నిందితుడిని పట్టుకొని విచారించగా భారీ బెట్టింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఇప్పటివరకు పోలీసులు గుర్తించిన దాని ప్రకారం ఈ బెట్టింగ్ ద్వారా రూ.176 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక బ్యాంక్ ఖాతాలను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ బెట్టింగ్ రాకెట్ విస్తరించి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. ఇదిలా ఉంటే.. ఇందులో కూటమి నేతల హస్తం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా పోలీస్ శాఖలో పలువురు ఈ బెట్టింగ్ రాకెట్‌కు సహకారం అందించారన్న ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులూ.. బెట్టింగ్ బాధితులే!
ఈ బెట్టింగ్ భూతానికి పలువురు పోలీసులు సైతం బలైనట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్‌లకు సహకరించిన వారిని పక్కన పెడితే.. కొంత మంది సిబ్బంది ఈ బెట్టింగ్‌లకు పాల్పడి.. రూ.లక్షలు పోగొట్టుకున్నారు. ప్రధానంగా ఏఆర్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన పలువురు సిబ్బంది ఈ బెట్టింగ్ దెబ్బకు భారీగా నష్టపోయినట్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment