హాస్టల్స్ మరమ్మతులకు నిధులు మంజూరు
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని 11 సాంఘిక సంక్షేమ వసతిగృహాలలో రూ.1.89కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మేజర్ పనుల నిమిత్తం రూ.150.81లక్షలు, మైనర్ మరమ్మతుల నిమిత్తం రూ.37.60లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. నాణ్యతలో రాజీలేకుండా ప్రభుత్వ సూచనలను పాటించి పనులను చేపట్టేలా ఏపీఈడబ్యూడీసీ, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, సర్వశిక్ష అభియాన్, గిరిజన సంక్షేమశాఖ అధికారులు కార్యనిర్వాహక ఏజెన్సీలను గుర్తించాలని ఆదేశించారు. పనులు చేపట్టకముందు, తరువాత ఫోటోలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. పనులకు సంబంధించిన పూర్తి బాధ్యతలను సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు
● కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎస్ శాస్త్రి
విజయనగరం రూరల్: విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తే ఉజ్వలమైన భవిష్యత్తును పొందగలరని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎస్.శాస్త్రి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన పాఠశాల 63 అథ్లెటిక్స్ మీట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈక్రీడలు డిసెంబర్ 21వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. చాణక్య, గజపతి,గుప్త,మొఘల్ అనే నాలుగు హౌస్‌లకు చెందిన 150మంది అథ్లెటిక్స్ 11 ట్రాక్స్‌లలో ఏడు ఫీల్డ్ ఈవెంట్లలో ఆసక్తిగా పోటీపడుతున్నారని, గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 21న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
చెట్టును ఢీకొన్న ఆటోడ్రైవర్‌కు తీవ్రగాయాలు
బొబ్బిలిరూరల్: మండలంలోని చింతాడ గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడి బంధువులు చెప్పిన వివరాల ప్రకారం బలిజిపేట మండలం వంతరాం గ్రా మానికి చెందిన ఆటో డ్రైవర్ కె.వెంకటి తన ఆటోలో చింతాడ నుంచి వంతరాం గ్రామానికి వెళ్తుండగా రహదారిలో తీవ్రమైన మంచుకారణంగా దారి కనిపించక పక్కనే ఉన్న చెట్టును ఆ టోతో ఢీకొన్నాడు. దీంతో వెంకటి తలకు తీవ్ర గాయం కాగా 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధాన్యం నూరుస్తుండగా వ్యక్తికి గాయాలు
మక్కువ: మండలంలోని దబ్బగెడ్డ పంచాయతీ, బోరింగువలస గ్రామానికి చెందిన ఓవ్యక్తి ధాన్యం నూర్పుడు యంత్రం వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కుడిచేయి నుజ్జునుజ్జయింది. గ్రామానికి చెందిన తాడంగి కృష్ణ గురువారం ఉదయం గ్రామం సమీపంలోని పంటపొలాల్లో నూర్పుడు యంత్రంతో ధాన్యం నూర్చే పనులు జరిపిస్తున్నాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో అతని కుడిచెయ్యి పడడంతో నుజ్జునుజ్జయింది. గ్రామస్తులు హుటాహుటిన వైద్యచికిత్స నిమిత్తం పార్వతీపురంలో ఓ అస్పత్రికి తరలించారు.
సీఐలకు బదిలీ
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. విజయనగరం జిల్లా సోషల్ మీడియా, సైబర్ సెల్ సీఐగా వీఆర్‌లో ఉన్న డి.బంగారుపాపను నియమించారు. ఇప్పటివరకూ సైబర్‌సెల్‌లో పనిచేసిన ఎల్. అప్పలనాయుడును ఎస్.కోట సీఐగా బదిలీ చేశారు. ఎస్.కోటలో పనిచేస్తున్న కవిటి రవికుమార్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న సాకేటి శంకరరావును విజయనగరం డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. అలాగే పార్వతీపురం మన్యం డీఎస్బీ–2లో పనిచేస్తున్న కె.మురళీధర్‌ను పార్వతీపురం టౌన్‌కు, వీఆర్‌లో ఉన్న బి.శ్రీనివాసరావును అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల సర్కిల్‌కు, అదేవిధంగా శ్రీకాకుళం డీఎస్బీలో ఉన్న పి.సూర్యనారాయణను కాశీబుగ్గకు, కాశీబుగ్గలో పనిచేస్తున్న దాడి మోహనరావును శ్రీకాకుళం డీఎస్బీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment