సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నద్ధం
పార్వతీపురం: సాగునీటి వినియోగదారుల దారుల సంఘాల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 14న సాగునీటి సంఘాలకు, 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో సాగునీటి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులను గత నెల 3వ వారంలో నిర్వహించారు. మిగిలిన ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. బుధవారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 14న సాగునీటి సంఘాలకు, 17న డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు రెండు విభాగాలుగా నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 14న ఉదయం సాగునీటి సంఘ సభ్యుల(ప్రాదేశిక సభ్యులు) ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయా సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నిక ఇలా..
18ఏళ్లు నిండిన వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్ దారు పోటీకి అనర్హులు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, పారితోషికాలు పొందేవారు అనర్హులు. ఎన్నికను మూడు విధాలుగా నిర్వహించనున్నారు. తొలుత అక్షరమాల ప్రకారం అభ్యర్థుల వరుస క్రమాన్ని నిర్ణయిస్తారు. ముందుగా ఏకగ్రీవం అవుతుందేమో చూస్తారు. లేకుంటే అభ్యర్థుల వరుస క్రమం ప్రకారం వేదిక పైకి అభ్యర్థిని పిలిచి చేతులు పైకి ఎత్తే విధానంలో ఎన్నిక జరుగుతుంది. ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. చేతులెత్తే విధానం వీలు పడకపోతే రహస్య బ్యాలెట్‌ను అనుసరిస్తారు. ఓటు వేసే రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, ఏ ఇతర గుర్తింపు కార్డుతోనైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
జిల్లాలో..
జిల్లాలో 22 భారీ నీటిపారుదల, 25 మధ్య తరహా, 166 చిన్నతరహా నీటి వనరులకు ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్లు జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పలనాయుడు తెలిపారు.
పూర్తయిన ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment