టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో.. సాగుసాయం అందుతుందని ఆశిం
ఆరునెలల్లోనే కూటమి ప్రభుత్వ అస్తవ్యస్తపాలనపై నిరసనజ్వాల రగులుతోంది.
ఎన్‌టీఆర్‌ను దించేయడంతో 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారం పీఠం ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకూ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు విజయనగరం జిల్లాకు చేసిన మేలు ఒక్కటీ కనిపించదు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలను పక్కాగా అమలుచేస్తామని చెబితే జిల్లా ప్రజలు నమ్మి మరోసారి పట్టంకట్టారు. కానీ ఈసారీ మోసపోయామనే భావిస్తున్నారు. ఈ ఆర్నెల్లలో మహిళలకు ప్రతీ నెలా రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం రూ.155.08 కోట్లు, నిరుద్యోగ భృతి రూ.176.72 కోట్లు, తల్లికి వందనం పథకంతో రూ.384.82 కోట్లు, రైతులకు పెట్టుబడి సాయం రూ.548.5 కోట్లు ఇప్పటికే జిల్లా ప్రజలకు అందాలి. కానీ ఇప్పటివరకూ ఒక్క పైసా అందలేదు. ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు పథకంలో ఒక్క సిలెండరు మాత్రమే ఇవ్వడం, అన్న క్యాంటీన్లను ప్రారంభించడం ఒక్కటే కూటమి నాయకులు ఘనతగా చెప్పుకుంటున్నారు. ఉచిత బస్సు దాదాపు 8.45 లక్షల మంది మహిళలకు ఉపయోగపడాలి. సంక్రాంతి నుంచి అమలుచేస్తామని ఊరిస్తున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ముందుకు కదలట్లేదు. అక్కడక్కడా రోడ్లపై గోతులు మాత్రం పూడ్చుతున్నారు. అదైనా చేస్తున్నారనే అనుకునేలోగా రాష్ట్ర రహదారులను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి టోల్‌ట్యాక్స్ ముక్కుపిండి వసూలుచేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత మున్సిపాలిటీల్లో వీధిరోడ్లను ఇచ్చేయాలనే ఆలోచన కూడా చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
టీడీపీ, జనసేన, బీజేపీ... మూడు పార్టీల కూటమి నాయకులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతుల సహా ప్రజలందరికీ అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అవే మూడు పార్టీల కూటమి అధికారంలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆ పార్టీల నాయకులు నానా సాకులు చెబుతున్నారు. అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని, భూమినే నమ్ముకున్న అన్నదాతలను విస్మరిస్తున్నారు. విత్తనాల సరఫరా దగ్గర నుంచి మొద లైన రైతుల కష్టాలు ఇప్పుడు చేతికొచ్చిన పంట ధాన్యం విక్రయించుకోవడానికీ ప్రైవేట్ వ్యాపారులు, దళారులదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ప్రకటనలకే తప్ప క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ ఆర్నెల్ల పాలనతోనే రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వారి ఆవేదన అర్థం చేసుకునేందుకు జిల్లాలో మంత్రి కానీ, కూటమి ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యరంగంలోకి దిగుతోంది. తొలుత రైతుల తరఫున గొంతెత్తుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 13వ తేదీన (శుక్రవారం) జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రకటించిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకూ నిర్వహించనున్న ర్యాలీకి నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు హాజరవుతున్నారు. ఈ దృష్ట్యా అన్ని గ్రామాల నుంచి రైతులకు మద్దతుగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, మేయరు, మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు అంతా పాల్గొనాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు.
సూపర్ సిక్స్...
మేనిఫెస్టో
తుస్
అత్యంత ప్రధానమైన వ్యవసాయ
రంగంపై చిన్నచూపు
విత్తనాల సరఫరా దశ నుంచి ధాన్యం కొనుగోలు వరకూ మొండిచేయి
టీడీపీ కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలనపై వ్యతిరేకత
అందని సంక్షేమ పథకాలు..
ఆందోళనలో లబ్ధిదారులు
తూతూ మంత్రంగానే సాగుతున్న ప్రభుత్వ చర్యలు
నేడు రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నిరసన
కూటమి ప్రభుత్వానికి పలు డిమాండ్లతో వినతిపత్రం
కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వైఎస్సార్‌సీపీ నాయకులు
నాటి భరోసా నేడు ఏదీ?
గత ఆర్నెల్ల పాలన చూసిన జిల్లా ప్రజలు ముఖ్యంగా రైతులు ‘ఇదే జగన్ ఉంటేనా...’ అని తలచుకుంటున్నారు. ఎందుకంటే ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన వ్యవసాయ రంగానికి స్వర్ణయుగంలా ఉండేది. రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా తానున్నానంటూ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉండేవారు. వారి సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను అమలుచేశారు.
జిల్లాలో వైఎస్సార్ రైతుభరోసా పథకంలో దాదాపు 3 లక్షల మంది రైతులకు నేరుగా మేలు జరిగింది. ఐదేళ్లలో రూ.1,879.19 కోట్లు వారికి పెట్టుబడి సాయంగా అందింది.
తుపానులు, అకాల వర్షాలతో నష్టపోయిన 37,497 మంది రైతులకు రూ.33.08 కోట్లు మేర నష్టపరిహారం సత్వరమే చేతికందింది.
పశువులు, జీవాలను నష్టపోయిన 6,435 మంది రైతులకు రూ.29.87 కోట్ల మేర పరిహారం వచ్చింది.
ఇక సున్నా వడ్డీ పంటల రుణాల పథకంలో 1.15 లక్షల మంది రైతులకు రూ.17.13 కోట్ల మేర లాభం చేకూరింది. అంతేకాదు వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరాయి.
నిరసన విజయవంతం చేయాలి
కూటమి ప్రభుత్వంలో అష్టకష్టాలు పడుతున్న రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తలపెట్టాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. శుక్రవారం (13వ తేదీ) ఉదయం 10 గంటలకల్లా కంటోన్మెంట్ మున్సిపల్ పార్కు (షాలిమార్ హోటల్ ఎదురుగా) వద్దకు అందరూ చేరుకోవాలి. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి రైతుల తరఫున జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం.
– మజ్జి శ్రీనివాసరావు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment