చిరస్మరణీయుడు ద్వారం వెంకటస్వామినాయుడు
విజయనగరం టౌన్: సంగీత కళానిధి, పద్మశ్రీ డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు చిరస్మరణీయుడని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కేఏవీఎల్‌ఎన్ శాస్త్రి పేర్కొన్నారు. కళాశాల ఆవరణలో గురువారం ద్వారం వెంకటస్వామినాయుడు సంస్మరణ సభ నిర్వహించారు. కళాశాల ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలుల వేసి నివాళులర్పించారు. సాయంత్రం కళాశాల కచేరీ మందిరంలో ద్వారం చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎం.నీలాద్రిరావు నిర్వహించిన వయోలిన్ కచేరీ ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది.
విజయవాడకు ఉద్యోగులు
విజయనగరం అర్బన్: విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విడుదల చేయనున్న ‘స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్–2047’ కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపాధ్యాయ, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు గురువారం బయలుదేరారు. వీరు బయలుదేరిన వాహనాలను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ స్థానిక కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లా నుంచి ఐదు బస్సుల్లో సుమారు 250 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను పంపిస్తున్నామని చెప్పారు. మరో 60 మందిని ఇతర వాహనాల్లో పంపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, ఎస్‌డీసీలు మురళీకృష్ణ, సుధారాణి, సీపీఓ ఆఫీస్ ఏడీ రామలక్ష్మి, డీపీఆర్‌ఓ డి.రమేష్, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై వినతులివ్వండి
● జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ
విజయనగరం అర్బన్: షెడ్యూల్ కులాల్లోని ఉపవర్గీకరణ అంశంపై విచారణకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏకసభ్య కమిషన్‌ను నియమించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామానందం తెలిపారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ విచారణకు ఏకీకృత కమిషన్ అధికారిగా విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించారన్నారు. సంబంధిత ఏకసభ్య కమిషన్ కార్యాలయం విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో ఉపవర్గీకరణ అంశానికి సంబంధించి ఎవరైనా సంతకంతో మెమొరాండం, వినతులను వ్యక్తిగతంగా రిజిస్టర్ పోస్టు, మెయిల్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. జిల్లా ప్రజలు 2025వ సంవత్సరం జనవరి 9వ తేదీ వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
హత్యకేసులో నిందితునికి జీవిత ఖైదు
విజయనగరం క్రైమ్: హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితునికి జీవిత ఖైదు, జరిమానాను విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.అప్పలస్వామి తీర్పువెల్లడించినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసు పూర్వాపరాలిలా.. వన్‌టౌన్ పరిధిలో జొన్నగుడ్డి ఎరుకుల పేటకు చెందిన వారణాసి సూర్యనారాయణ అదే ప్రాంతానికి చెందిన కామేశ్వరి అనే మహిళను కులాంతర వివాహం చేసుకుని జీవనం సాగించారు. వారికి ఒక పాప జన్మించింది. సూర్యనారాయణ మద్యానికి బానిసై, తాగివచ్చి శారీరకంగా, మానసికంగా వేధించడంతో బిడ్డతో కలిసి భార్య వేరే అద్దె ఇంటిలో నివసిస్తోంది. 2024 మే15న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కామేశ్వరి తల్లిపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదుచేశారు. అప్పటి డీఎస్పీ ఆర్.గోవిందరావు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టుచేసి అభియోగపత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జీవితఖైదు, రూ.1000 జరి మానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ వాదనలు వినిపించగా, వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ త్రిమూర్తులు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారు. వీరిని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment