ధాన్యం అన్‌లోడింగ్‌లో.. మిల్లర్ల చేతివాటం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కరకనాయుడు. ఇతనిది గంట్యాడ మండలం పెదవేమలి. ఈయన పండించిన 1121 రకానికి చెందిన 76 బస్తాలు (82 కేజీలవి) గంట్యాడ మండలం సిరిపురం సమీపంలోని మిల్లుకు తీసుకెళ్లారు. అక్కడ ధాన్యం అన్‌లోడ్ చేసేందుకు మిల్లు సిబ్బంది రూ.760 తీసుకున్నారు.
విజయనగరం ఫోర్ట్/విజయనగరం అర్బన్: ఈ ముగ్గురే రైతులే కాదు. జిల్లాలో అనేక మంది రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కూటమి సర్కారు ఓ వైపు గొప్పలు చెబుతోంది. వాస్తవ పరిస్థితి చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మిల్లుకు ధాన్యం తీసుకుని వెళ్లిన రైతుల వద్ద అన్‌లోడింగ్‌కు మిల్లుల యాజమానులు ముక్కుపిండిమరీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పలువురు రైతులు వాపోతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉచితంగా చేయాల్సి ఉన్నా...
జిల్లా రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో 97,776 హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. పంట చేతికందడంతో జిల్లాలో ఏర్పాటుచేసిన 507 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 99,168 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ట్రక్‌సీట్ జనరేట్ అయిన తర్వాత రైతులు ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తారు. అక్కడ ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం ఉచితంగా ఆన్‌లోడ్ చేయించుకోవాలి. మిల్లు యాజమనాలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. 82 కేజీల బస్తాకు రూ.10 చొప్పన వసూలు చేస్తున్నారు. మిల్లులకు ఇప్పటి వరకు 11,90,016 బస్తాలు ధాన్యం వెళ్లాయి.
చర్యలు తీసుకుంటాం..
ధాన్యం మిల్లు వద్ద ఆన్‌లోడ్ చేసేందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలి. చర్యలు తీసుకుంటాం.
– మీనాకుమారి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లై
అదే గ్రామానికి చెందిన సిరపురపు సత్యారావు అనే రైతు సిరిపురం సమీపంలో ఉన్న మరో మిల్లుకు 148 బస్తాలు ధాన్యం తీసుకొని వెళ్లారు. అతని వద్ద కూడా ధాన్యం ఆన్‌లోడింగ్ చేయడానికి రూ.1480 తీసుకున్నారు.
జామి మండలం అన్నంరాజుపేటకు చెందిన రాజు అనే రైతు గంట్యాడ మండలంలోని రావివలస సమీపంలో ఉన్న మిల్లుకు 75 బస్తాల ధాన్యం తీసుకుని వెళ్లారు. అతని వద్ద కూడా రూ.750 వసూలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment