గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
● డీఎస్పీ శ్రీనివాసరావు
● కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద 810 కిలోల గంజాయి పట్టివేత
● ముగ్గురు నిందితుల అరెస్టు
● పరారీలో మరో నలుగురు నిందితులు
● మూడు వాహనాలు స్వాదీనం
రామభద్రపురం: గంజాయి అక్రమరవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టామని డీఎస్పీ పి.శ్రీనివాసరావు అన్నారు.ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు అక్రమంగా గంజాయి రవాణాచేస్తున్న లారీ, మహీంద్రా వ్యాన్, బొలెరో కారును కొట్టక్కి చెక్ పోస్టు వద్ద రామభద్రపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా 810 కిలోల గంజాయిని, మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు అక్రమ రవాణాదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి సీఐ నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావుతో కలిసి డీస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులో వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో సాలూరు నుంచి ఓ బొలెరో కారు వస్తుండగా అనుమానంతో ఆపి చెక్ చేస్తున్న సమయంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోయారు. వారెందుకు పారిపోతున్నారన్న అనుమానంతో కారు చెక్ చేయగా డ్రైవర్ దొరికాడు. ఆ కారులో 30 కిలోల గంజాయి ఉంది. అలాగే అదే రూట్‌లో మరో మహింద్రా గూడ్స్ వ్యాన్ వస్తుండగా ఆపేసరికి పోలీసులను చూసి అందులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి పారిపోయాడు. ఆ గూడ్స్ వ్యాన్‌లో మరో 30 కిలోల గంజాయి పట్టుబడింది. అలాగే ఆ వెనకాల ఓ లారీ బొగ్గులోడుతో వస్తుండగా లారీని ఆపి చెక్ చేయగా లారీలో పైన బొగ్గు బస్తాలు ఉండగా మధ్యలో 25 గంజాయి బస్తాలు, కిందన మళ్లీ బొగ్గు బస్తాలు వేసుకుని గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని మూడు వాహనాల్లో మొత్తం గంజాయితో పాటు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను విచారణ చేయగా లారీలో ఉన్న వారు మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ హుకుం సోలంకి, క్లీనర్ అనిల్ సోలంకిలు తండ్రీకొడుకులుగా తెలిసింది. వారు గంగవరం పోర్టులో బొగ్గు లోడు చేసుకుని మధ్యప్రదేశ్ వెళ్తున్నారు. వారు రామభద్రపురం మీదుగా మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా డబ్బులకు ఆశపడి సాలూరు రూరల్ పరిధిలోని గ్రీన్ హైవేకు వెళ్లి అక్కడ 25 గంజాయి బస్తాలు లోడు చేసుకుని తిరిగి రామభద్రపురం మీదుగా వెళ్లేందుకు వస్తున్నారు. అలాగే బొలెరో కారు డ్రైవర్ కొరాపుట్‌కు చెందిన జ్యోతి బూషన్ బెహరాగా విచారణలో తెలిసింది. మూడు వాహనాలలో ఉన్న మొత్తం 810 కిలోల గంజాయిని, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రిమాండ్‌కు ముగ్గురు నిందితులు
ఎ1గా హుకుం సోలంకి, ఎ2గా అనిల్ సోలంకి, ఎ3గా జ్యోతి బూషన్ బెహరాపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బొలెరో కారులో వేరే వేరే నంబర్లతో ఉన్న నంబర్ ప్లేట్లు, పోలీసు వ్యాన్ అనే బోర్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారైన వారితో పాటు గంజాయి అక్రమ రవాణా వెనుక ప్రధాన పాత్రధారులు ఎవరున్నారో పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని మాటు వేసి పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్సై వి.ప్రసాదరావు, కానిస్టేబుల్ విష్ణులను అభినందిస్తూ రివార్డులకు ప్రతిపాదించినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment