వైద్యకళాశాలకు తరలించండి
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించాలని పౌర వేదిక అధ్యక్షుడు బి.బాబ్జి కోరారు. గత నెలలో ఆస్పత్రిని పరిశీలించి తయారు చేసిన నివేదికను పౌరవేదిక కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చిన తర్వాత ఊహించని స్థాయిలో ఓపీ, ఐపీ పెరిగిందన్నారు. కేథ్‌ల్యాబ్, ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
15న సీనియర్స్ జూడో క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ సీ్త్ర, పురుషుల జూడో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఎంపిక పోటీల కో ఆర్డినేటర్ బి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించే ఎంపిక పోటీల్లో 15 సంవత్సరాలు వయస్సు దాటిన క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. పోటీలకు హజరయ్యే క్రీడాకారులు విధిగా జనన ధ్రువీకరణపత్రం, ఆధార్ కార్డులు వెంట తీసుకురావాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆర్‌ఐ బంగ్లా ఆక్రమణ..!
కొత్తవలస: అధికార బలంతో దశాబ్దాల కిందట నిర్మించిన ఆర్‌ఐ బంగ్లా అక్రమణకు పూనుకున్నారు. బంగ్లాను కూల్చేసి జేసీబీతో స్థలాన్ని చదును చేసేశారు. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో అధికారులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో అరకు–విశాఖ జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నంబర్ 24–6లో ఆరుసెంట్ల స్థలంలో మునసబుదారీ వ్యవస్థ సమయంలో ఆర్‌ఐ బంగ్లాను నిర్మించారు. భూమి శిస్తు వసూళ్లు, ప్రభుత్వ కార్యకలాపాలు ఈ భవనం నుంచే సాగేవి. ఆ వ్యవస్థ రద్దుకావడంతో భవనం నిరుపయోగంగా మారింది. ఈ రోడ్డులో బహిరంగ మార్కెట్‌లో సెంటు సుమారుగా రూ.3 లక్షలకు పైబడి పలుకుతోంది. దీంతో కబ్జాదారుల కన్ను పడింది. రెండు రోజుల కిందట భవనాన్ని కూల్చేసి జేసీబీతో చదును చేయించేశారు. స్థానిక సీపీఎం నాయకుడు గాడి అప్పారావు ఆధ్వర్యంలో డీటీ పప్పుహరికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆశ్చర్యపోయారు. భవనాన్ని అక్రమంగా కూల్చివేసిన వ్యక్తిపై పోలీస్ కేసు నమోదు చేస్తామని డీటీ తెలిపారు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఓల్డు ఆర్‌ఐ బంగ్లాగా నమోదై ఉందని స్పష్టంచేశారు.
కొత్తవలసలో గోమాంసం కలకలం!
● కొద్ది నెలలుగా బిర్యానీ కేంద్రాలకు
సరఫరా
● పోలీసులకు సమాచారం
● మాంసం స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టిన పోలీసులు
కొత్తవలస: మండల కేంద్రంలోని విశాఖపట్నం రోడ్డులో ఉన్న ఓ బిర్యానీ కేంద్రంలో 60 కిలోల గోమాంసంను పోలీసులు స్వాధీనం చేసుకోవడం శుక్రవారం కలకలం సృష్టించింది. సాయంత్రమైతే చాలు భోజన ప్రియలు ఈ కేంద్రానికి వచ్చి బిర్యానీని లొట్టలేసుకుని మరీ తింటారు. ఓ అజ్ఞాత వ్యక్తి యథావిధిగా బిర్యానీ పాయింట్‌కు గోమాంసం చేరవేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో బిర్యానీ పాయింట్‌కు చేరుకుని మాంసంను స్వాధీనం చేసుకున్నారు. బిర్యానీ పాయింట్ నిర్వాహకుడిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడాక విడిచిపెట్టారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని గొయ్యితీసి పాతిపెట్టినట్టు నిర్వాహుకుడు, పోలీస్‌లు తెలిపారు. ఈ విషయంపై సీఐ షణ్ముకరావు మాట్లాడుతూ అది గోమాంసమని నిర్ధారించలేమని, శాంపిల్స్‌ను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అందజేస్తామన్నారు. నివేదిక ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కొత్తవలసలోని విశాఖపట్నం రోడ్డులో పలు బిర్యానీ కేంద్రాలు ఉన్నాయి. పోలీసులు గోమాంసం స్వాధీనం చేకున్నారన్న వార్తతో భోజన ప్రియులు ఉలిక్కిపడ్డారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment