నిధులున్నా నిర్లక్ష్యమే.. !
నల్లబెల్లి: జిల్లాలో 500కు పైగా జనాభా ఉన్న పల్లెలు, తండాలు, గిరిజన గూడేలను గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొత్త గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సొంత భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో కనీస వసతులు లేకపోవడంతో సమావేశాలు నిర్వహించుకునేందుకు పాలకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గత ప్రభుత్వం దృష్టి సారించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 133 గ్రామ పంచాయతీలకు రెండేళ్ల కిందట భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.26.60 కోట్ల నిధులను కేటాయించింది. కాగా, నేటికీ 23 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. 27 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన 83 భవనాల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభించలేదు. గతంలో సర్పంచ్‌లు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లింపులు చేయలేదు. దీంతో పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఫలితంగా పంచాయతీల పాలనను అద్దె భవనాలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నెట్టుకొస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బిల్లులు చెల్లించి, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నత్తనడకన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు
బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణం
జిల్లాలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలు 133
పూర్తయినవి 23.. నిర్మాణంలో ఉన్న జీపీలు 27
పై ఫొటోలో ఓపెన్ స్లాబ్ దశలో కనిపిస్తున్న భవనం నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామ పంచాయతీకి చెందింది. పంచాయతీ భవన నిర్మాణం కోసం 2022లో అప్పటి ప్రభుత్వం రూ.20 లక్షలు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు చేసింది. ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. దీంతో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంలో సమావేశాలు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పంచాయతీల్లోనే కాదు జిల్లాలో అనేక గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment