గిరిజనుల సంక్షేమానికి కృషి
నర్సంపేట: దేశంలో ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి పాటుపడింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో శుక్రవారం ఆదివాసీ గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన దినోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బిర్సా ముండా దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గిరిజన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప ఉద్యమకారుడని అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.6,600 కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో 15 గ్రామాలు ఎంపిక కాగా.. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి పది గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఈ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన భూములకు హక్కుపత్రాలు మంజూరు చేసి ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానని, వారి కోరిక మేరకు బిర్సా ముండా విగ్రహం ఏర్పాటుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ మహాలక్ష్మి, డీటీడీఓ సౌజన్య, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, నర్సంపేట సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ శశిధర్‌రెడ్డి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బిర్సాముండా జయంతి వేడుకల్లో
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment